Tuesday, November 26, 2024

స్టాక్‌మార్కెట్లకు లాభాల జోరు.. సెన్సెక్స్‌ 935.73..నిఫ్టీ 240.85పాయింట్లు వృద్ధి

సోమవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆద్యంతం సానుకూలంగా కొనసాగిన సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఐటీ, టెక్‌ రంగాల నుంచి లభించిన మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు వెలువడటంతోపాటు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు సూచీలపై ప్రభావం చూపాయి. రష్యా నుంచి చమురు, కమొడిటీలను భారత్‌ రాయితీ ధరకు కొనుగోలు చేయనుందని వార్తలు వెలువడటం మదుపర్లులో ఉత్సాహం నింపింది. రష్యాపై పలు దేశాల ఆంక్షల నేపథ్యంలో ఆ దేశానికి చెల్లింపులును రూపాయల్లో చెల్లించే అంశంపై భారత్‌ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికాలో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, ద్రవోల్బణ ముప్పు, చైనాలో కరోనా కేసుల పెరుగుదల తదితర ప్రతికూల పరిణామాలను అధిగమించి దేశీయ సూచీలు రాణించాయి.

సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 55,614.40వద్ద లాభాలతో ప్రారంభమైన సూచీ 56,538.40-55,556.47 మధ్య కదలాడి..చివరకు 56,486.02వద్ద 935.72పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 16,633.70వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 16,887.55-16,606.50 మధ్య కదలాడి చివరకు 240.85పాయింట్లు వృద్ధితో 16,871.30వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 3.5శాతానికిపైగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఆంక్షలను ఎత్తివేయడం, కొత్త డిజిటల్‌ సేవలను ప్రారంభించేందుకు అనుమతించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటనతో ఆ బ్యాంక్‌ షేర్లు జోరందుకున్నాయి. హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో 14శాతానికి కుంగిన షేరు రూ.661.50వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. పర్యవేక్షణ లోపాలను గుర్తించిన ఆర్బీఐ..బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం కొత్త ఖాతాలు తెరవడాన్ని నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఆదేశించడంతో షేర్లు కుదేలయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.76.48వద్ద కొనసాగింది.

గెయిల్‌ షేర్‌హోల్డర్లకు బంపరాఫర్‌..

పబ్లిక్‌ సెక్టార్‌ యుటిలిటీ దిగ్గజం గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ.5 చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్‌ వెల్లడించింది. మొత్తం చెల్లింపులకు 2వేలకోట్లకుపైగా కేటాయించనుంది. ఇంతకుముందు 2021 డిసెంబర్‌లో షేరుకి రూ.4చొప్పున డివిడెండును చెల్లించింది. ఈ ఆర్థికసంవత్సరంలో ఒక్కో షేరుకి రూ.9చొప్పున మొత్తం 3,996కోట్లుకు పైగా డివిడెండు కింద చెల్లిస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌, ఎండీ మనోజ్‌ జైన్‌ తెలిపారు. గెయిల్‌ చరిత్రలో ఇదే అత్యధికమని వెల్లడించారు. కంపెనీలో 51.45శాతం వాటా ఉన్న ప్రభుత్వానికి రెండో మధ్యంతర డివిడెండుకింద రూ.1,142కోట్లు అందనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement