స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా నష్టపోయాయి. మార్చి నెలకు సంబంధించి వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణ ఫలితాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేశాయి. దీంతో మదుపరులు అమ్మకాల వైపు పరుగులు పెట్టారు. ముఖ్యంగా మెటల్, ఐటీ రంగాల్లో భారీ నష్టాలు చవిచూశారు. ఈ రెండు రంగాలకు సంబంధించిన షేర్లు క్షీణించాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు నష్టాలు తప్పలేవు. ఉదయం సెన్సెక్స్ 58,743.50 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,298.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 388.20 పాయింట్ల నష్టంతో 58,576.37 పాయింట్ల వద్ద ముగిసింది. 17,584.85 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 17,595.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,442.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 144.65 పాయింట్లు నష్టపోయి 17,530.30 పాయింట్ల వద్ద ముగిసింది.
రూ.271.98 లక్షల కోట్లకు బీఎస్‌ఈ వ్యాల్యూ
సెన్సెక్స్ 30 షేర్స్‌లో టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, పవర్‌గ్రిడ్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంకు షేర్లు లాభాల్లో పయనించాయి. రూ.3.18 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్ వ్యాల్యూ… రూ.271.98 లక్షల కోట్లకు పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ బలహీనంగా ఉన్నప్పటికీ.. బంధన్ బ్యాంకు స్టాక్ ఆరు నెలల గరిష్టానికి చేరుకోవడంతో కొంత బూస్ట్‌లభించింది. దీంతో చివర్లో నిఫ్టీ బ్యాంకు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. ఈ బ్యాంకులోని తమ వాటాలను హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించిన విషయంతెలిసిందే. దీంతో గత మూడు రోజుల్లో స్టాక్ 9 శాతానికి పైగా ఎగబాకింది. నిఫ్టీలో 15 సెక్టార్స్‌లో 12 సెక్టార్లు నష్టాల్లో ముగిశాయి.
స్మాల్ క్యాప్‌లో 1.58 శాతం క్షీణత
నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.92 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.58 శాతం క్షీణించాయి. ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిఫ్టీ 17,600 ట్రెండ్ సపోర్టును బ్రేక్ చేసింది. నిఫ్టీ మెటల్ 2.74 శాతం, నిఫ్టీ ఐటీ 1.48 శాతం మేర క్షీణించాయి. హిందాల్కో స్టాక్ 5.77 శాతం మేర పడిపోయి రూ.543.10కు చేరుకుని నిఫ్టీలో టాప్ లూజర్‌గా నిలిచింది. దేశంలో 5జీ సేవల కోసం మార్గాన్ని సిద్ధం చేయడంతో పాటు రూ.7.50లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలానికి ప్రణాళికను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. 5జీ స్పెక్ట్రమ్ కనీస ధరలో ట్రాయ్ 35 శాతం కోతను సిఫార్సు చేసింది. ఈ కోత ఆశించినమేర కంటే తక్కువ ఉండటంతో.. టెలికాం స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ 2.12 శాతం క్షీణించి రూ.742 వద్ద స్థిరపడింది. వొడాఫోన్ ఐడియా 2.3 శాతం నష్టపోయింది.
రెండు రోజుల్లో 871 పాయింట్లు డౌన్
రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్‌్ 871 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 17,600 పాయింట్ల దిగువన పడిపోయింది. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కాస్త కోలుకుని 388 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. బాండ్స్ రాబడుల పెరుగుదల, ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, దేశీయంగా కరోనా కొత్త వేరియంట్, రిటైల్ ద్రవ్యోల్బణం అంశాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి.