Thursday, November 21, 2024

TG | పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అధికారులపై దాడి వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పక్క పథకం ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రపన్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ సహా పార్టీ ఇతర నేతల ఆదేశాలతో అధికారులపై దాడి వ్యూహం పన్నినట్లు నరేందర్‌రెడ్డి నేరం అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. దీంతో పట్నం నరేందర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేరును కూడా పోలీసులు చేర్చారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు ఇతరుల ఆదేశాలు కూడా ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పట్నం నరేందర్‌ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్‌ ద్వారా గ్రామస్థులను ప్రభావితం చేసి గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.

లగచర్లలో ఈ నెల 11న ఫార్మా విలీజ్‌ భూసేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సహా పలువురి అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌కు తరచూ ఫోన్‌ చేసినట్లు నరేందర్‌ రెడ్డి అంగీకరించారని పోలీసులు తెలిపారు.

పట్నం నరేందర్‌రెడ్డి అదేశాల మేరకే దుద్యాల మండలంలోని పలు గ్రామాలలోని రైతులను సురేష్‌ రెచ్చగొట్టినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్ల కేసులో తొలుత ఏ1గా బోగమోని సురేష్‌ను పేర్కొన్న పోలీసులు విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement