Saturday, November 23, 2024

కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశానికి సీనియర్లు డుమ్మా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశానికి కొంత మంది సీనియర్లు హాజరు కాలేదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై సోమవారం చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల కోసం టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీ పీసీసీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ, వివిధ కమిటీల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో టీ పీసీసీ కార్యవర్గం సమావేశానికి రావాలని గాంధీభవన్‌ నుంచి ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశాన్ని కొంత మంది నాయకులు సీరియస్‌గా తీసుకోలేదని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.

ఈ సమావేశానికి హాజరుకానీ వారిలో స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, పొడెం వీరయ్య , ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదిరులున్నారు. అయితే కొంత మంది రచ్చబండ కార్యక్రమంలో ఉండగా, మరి కొందరు నాయకులు వ్యక్తిగత పనులు ఉండటంతో హాజరుకాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement