సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ ఉదయం కన్నుమూశారు. భారత న్యాయరంగంలో మహోన్నత వ్యక్తి అయిన నారిమన్ న్యాయవాద ప్రతిభ, న్యాయవాద వారసత్వాన్ని వదిలితన 95 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. గొప్ప న్యాయవాదిగా పేరొందిన ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఇచ్చి సత్కరించింది.
ఫాలీ ఎస్ నారిమన్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్ లోని పార్సీ కుటుంబంలో జన్మించారు. బాంబే హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 38 ఏళ్ల వయసులో హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 1971 నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా దేశ అత్యున్నత పౌర పురస్కారాలను నారీమన్ అందుకున్నారు.
భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారిమన్ కీలక పాత్ర పోషించారు. అలాగే.. 1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేశారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఇక.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించారు నారిమన్. అయితే అది పొరపాటని తర్వాత ఇంటర్వ్యూలలో ఆయన పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్ కేసును సైతం (ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి..) ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. నారీమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.