కరోనా మహమ్మారికి మరో పాత్రికేయుడు బలయ్యారు. ప్రముఖ జర్నలిస్టు, ఉద్యమ నేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆయన కరోనాతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. అమర్నాథ్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని పాత్రికేయ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. జర్నలిస్టుల సమస్యలపై తనవంతు బాధ్యతలను సమర్థవంతంగా పోషించారని, నిరాడంబరంగా జీవించారని, అందరితో ఆత్మీయంగా మెలిగారని కొనియాడారు.
కాగా అమర్నాథ్ మృతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో అమర్నాథ్ తనదైన ముద్ర వేశారని, జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు అమర్నాథ్ అకాల మృతి జర్నలిస్టులకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. మూడు దశబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు.