టాలీవుడ్ సీనియర్ నటి జయంతి (76) అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జయంతి తొలిసారిగా 1960లో ‘యానై పాగన్’ అనే తమిళ సినిమాతో మొదటిసారి బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ప్రముఖ కన్నడ సినిమా ‘జేను గూడు’ సినిమాతో 1963లో హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం ‘భార్య భర్తలు’. అయితే తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అప్పట్లోనే 1960, 70, 80లలో జయంతి తన చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా మూడు దశాబ్దాలుగా హీరోయిన్గా నటించింది. ‘జగదేక వీరునికథ’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’, ‘కులగౌరవం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
జయంతి కేవలం తెలుగు, కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా ఏడు అవార్డులను అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 1965లో ‘మిస్ లీలావతి’ సినిమాకు గాను ఉత్తమనటి రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఆమెకు కన్నడ ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదు కూడా ప్రధానం చేసారు. జయంతి అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని బళ్లారిలో 6 జనవరి 1945లో జన్మించింది. ఆమె ప్రముఖ నటుడు దర్శకుడు పేకేటి శివరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు కృష్ణ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో భూకంపం.. ఎక్కడో తెలుసా?