హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ నుంచి మరో వందేభారత్ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి రాష్ట్ర్ర రాజధాని హైదరాబాద్ వరక హైస్పీడ్ రైలును నడుపనుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య వాణిజ్యం భారీ స్థాయిలో సాగుతుంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మొత్తంగా 25 రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైలు అందుబాటులో లేదు. నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య దూరం 581 కి.మీ.లు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.
ఈ మార్గంలో కొత్తగా వందే భారత్ రైలు ప్రవేశపెడితే సమయాన్ని 10 గంటల నుంచి 6-30 గంటలకు తగ్గనుంది. కాగా, నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు ప్రయాణించే రూట్‌ను సైతం భారతీయ రైల్వే సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ మధ్యలో బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేట జంక్షన్లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే వర్గాల సమాచారం. కాగా నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు నాగ్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12-30 గంటలకు, తిరిగి 1-30కు బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.
దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ మరో ఐదు…
త్వరలో మరో 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలలో ఈ రైళ్ల విస్తరణ కోసం భారతీయ రైల్వే సర్వే పూర్తి చేసింది. ఈ ఐదు రైళ్లలో మొదటిది ఒడిశా రాష్ట్రంలోని పూరీ-హౌరా మార్గంలో ప్రారంభం కానుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో రెండో రైలు, గౌహతి మార్గంలో సెమీ హై స్పీడ్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తున్నది. దీని తరువాత పాట్నా-రాంచీ మార్గంలో ముందస్తు రైలును ప్రారంభించాలని యోచిస్తోంది. హౌరా-పూరీ మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైన తరువాత భువనేశ్వర్-హైదరాబాద్, పూరీ-రాయ్‌పూర్, పూరీ-హౌరా మార్గాలలో మరిన్ని సెమీ-హై-స్పీడ్ రైళ్లను జోడించాలని ఒడిషా ప్రభుత్వం భారతీయ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది.
కాగా, పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలకు సంబంధించి భారతీయ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఉదయం 5-50కి బయలుదేరి 11-50కి ఒడిశాలోని పూరీకి చేరుకుంటుంది. వందే భారత్ మధ్యాహ్నం 2 గంటలకు పూరీలో బయలుదేరి రాత్రి 7-30 గంటలకు హౌరా చేరుకుటుంది. ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్, భద్రక్, బాలాసోర్, హాల్దియా స్టేషన్లు పూరీ-హౌరా రైలుకు స్టాప్‌లుగా ఉంటాయని పేర్కొంది. ఇక టికెట్ ధర విషయానికి వస్తే చైర్ కార్ ధర రూ.1,590, ఎగ్జిక్యూటివ్ తరగతికి రూ.2,815గా ఉండనుంది.