ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్ విద్యా విధానం అమలులోకి తెస్తోంది. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందజేస్తారు. ఇలా చేయడం ద్వారా పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది అంటున్నారు. తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్ బుక్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్ హ్యాండ్‌బుక్ కూడా ఇస్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.