న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్టీ వేదికలపై ఆత్మవిమర్శలు అవసరమేనని, అయితే అవి ఆత్మవిశ్వాసాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండరాదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విమర్శలు వినాశకరమైన వాతావరణాన్ని సృష్టించేలా ఉండొద్దని పార్టీ నేతలకు హితబోధ చేశారు. ‘చింతన్ శిబిర్’ కోసం మే 13, 14,15 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో సమావేశమవుతున్నామని, దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొంటారని ఆమె తెలిపారు. ‘నవ సంకల్ప్ శిబిర్’ పేరుతో జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనే సభ్యుల విషయంలో అన్ని కోణాల్లో సమతుల్య ప్రాతినిధ్యం కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ‘చింతన్ శిబిర్’లో 6 ప్రధానాంశాలు (రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత సమస్యలు)పై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సోనియా గాంధీ చెప్పారు.
నేతలు ఎవరు ఏ గ్రూప్‌లో పాల్గొనాలనే విషయంపై ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేసినట్టు తెలిపారు. మే 15వ తేదీ మధ్యాహ్నం ఉదయపూర్లో ‘నవ్ సంకల్ప్’ తీర్మానాలను సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాత అమలు చేస్తామని వివరించారు. పార్టీ వేగవంతమైన పునరుజ్జీవనానికి ఉదయపూర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా నేతల సహకారం కావాలని సోనియాగాంధీ కోరారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత, స్థితిస్థాపకతను ప్రదర్శించడానికి చింతన్ శిబిర్ వీలు కల్పిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందని, ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చిందని అన్నారు. చింతన్ శిబిర్ అనేది ఒక ఆచారంగా మారకూడదని, కాంగ్రెస్ ఎదుర్కొనే అనేక సైద్ధాంతిక, ఎన్నికల సవాళ్లను ఎదుర్కోవడానికి పునర్నిర్మించిన సంస్థను చింతన్ శిబిర్ వేదికగా ప్రకటించాలని నిర్ణయించుకున్నానని సోనియా గాంధీ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..