Tuesday, November 26, 2024

Fourth Umpire | సెలక్షన్‌ తప్పిదం, టాపార్డర్‌ వైఫల్యం.. డబ్ల్యుటీసీలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు

2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా, భారత్‌ జట్లను సమవుజ్జీలుగా క్రికెట్‌ పండితులు, మాజీ దిగ్గజాలు అంచనావేశారు. పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని ఆసీస్‌నే ఎక్కువ మంది టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొన్నారు. అదే సమయంలో భారత జట్టుపైనా భారీ అంచనాలు వేశారు. అంతిమంగా ఐసీసీ నాకౌట్లలో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా చాటిచెప్పింది. టీమిండియా మాత్రం ఫైనల్‌ ఫోబియా నుంచి బయటపడలేదని స్పష్టమైంది. మొత్తంగా ఈ మెగా టోర్నీలో భారత వైఫల్యానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి జట్టు ఎంపికలో తప్పిదాలు.. రెండవది దిగ్గజాలతో కూడిన టాపార్డర్‌ పేలవ ప్రదర్శన. ఓవల్‌ పిచ్‌ పరిస్థితులు పేస్‌తోపాటు స్పిన్‌కూ అనుకూలిస్తాయని మొదటి నుంచీ అందరూ అంచనా వేస్తూవచ్చారు. అలాంటి సమయంలో టాప్‌ ర్యాంక్‌ టెస్టు బౌలర్‌, ఏస్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడం టీమిండియా చేసిన అతిపెద్ద పొరపాటని సర్వత్రా విమర్శలు వచ్చాయి.

రవీంద్ర జడేజా, నాథన్‌ లియోన్‌లకు పిచ్‌ అందించిన సహాయాన్ని చూశాక అశ్విన్‌ను పక్కనబెట్టి భారత్‌ భారీ తప్పిదం చేసిందని రుజువైంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతిష్టాత్మకమైన పోరులో అత్యుత్తమ స్పిన్నర్‌ను ఆడించకపోవడాన్ని సచిన్‌ టెండూల్కర్‌తో సహా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లను కలిగివున్న నేపథ్యంలో అశ్విన్‌ను తీసుకుని ఉంటే పరిస్థితి కచ్చితంగా భిన్నంగా ఉండేదని క్రీడా పండితులు నొక్కిచెబుతున్నారు. పేస్‌ విషయానికొస్తే, మహ్మద్‌ షమీ, సిరాజ్‌ అద్భుతంగా రాణించినప్పటికీ, ఉమేష్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ జట్టు కోరుకున్న దాని కంటే తక్కువ ప్రదర్శనచేశారు.

- Advertisement -

తొలిరోజే మ్యాచ్‌ చేజారింది..

నిజం చెప్పాలంటే, డబ్ల్యుటిసి ఫైనల్‌ ఫలితం మొదటి రోజునే తేలిపోయింది. భారత్‌ మొదటి గంటలో అద్భుతంగా ఆడింది. అయితే ఆ తర్వాత బౌలర్లు మారడంతో ఆట కూడా మారింది. 70/3 నుంచి ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 327/3కి చేరుకుని మ్యాచ్‌పై పట్టుబిగించింది. చివరికి 469 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌కు బలమైన ప్రాంతాలలో బంతులు విసరడం ద్వారా టీమిండియా బౌలర్లు కోరికష్టాలు తెచ్చుకున్నారు. స్ట్రయిక్‌ను రొటేట్‌ చేయడమే కాకుండా, వేగంగా బౌండరీలు బాదేందుకు వీలుకల్పించారు. అతనికి మొదటి 29 బంతుల్లో కేవలం ఒక షార్ట్‌ బాల్‌ మాత్రమే వేయబడింది. హెడ్‌ బలహీనతల్ని గుర్తించే సమయానికే అతను సెంచరీకి చేరువై ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. దాంతో భారత బౌలర్ల పాచికలు పారలేదు.

టాప్‌ ఆర్డర్‌ వైఫల్యాలు..

గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కీలక సమయంలో చేతులెత్తేసింది. రెండు ఇన్నింగ్క్‌లలో 300 పరుగులు కూడా చేయలేకపోయింది. 2021 ఇంగ్లండ్‌ టూర్‌లో మాదిరి అద్భుత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ ఇక్కడ పునరావృతం చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడేందుకు శుభ్‌మన్‌ గిల్‌ సౌకర్యంగా కనిపించలేదు. సస్సెక్స్‌ తరఫున రెండు నెలలు కౌంటీ క్రికెట్‌ ఆడినప్పటికీ ఛెతేశ్వర్‌ పుజారా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. విరాట్‌ కోహ్లీ క్రీజులో ఎక్కువ సేపు ఉన్న అనుభూతిని కలిగించాడు, కానీ, రెండో ఇన్నింగ్స్‌లో వైడ్‌ బాల్‌ ట్రాప్‌లో పడి వికెట్‌ సమర్పించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడి షాట్‌ ఎంపిక దిగ్గజాలను అబ్బురపరిచింది.

పదును తగ్గిన పేస్‌

గత కొన్నేళ్లలో విదేశాల్లో టీమిండియా విజయాలు సాధించిందంటే అందుకు పేసర్లే కారణం. బుమ్రా, షమీ, సిరాజ్‌, ఉమేష్‌ ఇషాంత్‌ శర్మ క్రికెట్‌ ప్రపంచం అసూయపడేలా చేశారు. అయితే, వెన్ను గాయం కారణంగా బుమ్రా భవిష్యత్‌పై సందేహం నెలకొంది. అదే సమయంలో ఇషాంత్‌ను పక్కనబెట్టడం వల్ల టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ బలహీనంగా మారింది. షమీ, సిరాజ్‌ ఖచ్చితమైన బంతులు సంధించగలిగారు. అయితే ఉమేష్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ప్రభావం చూపలేకపోయారు. ఇది భవిష్యత్‌ టోర్నీల్లో భారత్‌కు ప్రధాన సమస్యగా మారనుంది.

మైదానంలో విషయాలు పక్కన పెడితే, ఫిట్‌నెస్‌ విషయంలో కూడా టీమిండియా సవాళ్లు ఎదుర్కొంటున్నది. నవదీప్‌ సైనీ, కమలేష్‌ నాగర్‌కోటి (అతను కూడా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు), ఇషాన్‌ పోరెల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌, శివమ్‌ మావి, కార్తీక్‌ త్యాగి సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రావడంపై స్పష్టతలేదు. వీరు బంతితోపాటు బ్యాట్‌తోనూ రాణించగలరు. ముుెత్తంమీద, ఈ అంశాలన్నీ భారత టెస్టు జట్టులో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు తక్షణ శ్రద్ధ అవసరమని స్పష్టంచేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement