Monday, November 25, 2024

Delhi | కేసీఆర్ నివాసం వద్ద శేజల్ ఆందోళన.. శేజల్‌తో మంతనాలు సాగించిన మాజీ ఎంపీ వినోద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ వ్యవస్థాపకురాలు బోడపాటి శేజల్ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధికారిక నివాసం (23, తుగ్లక్ రోడ్) వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి కే.టీ. రామారావు శుక్రవారం ఢిల్లీ వచ్చిన విషయం తెలుసుకున్న శేజల్, ఆయన్ను కలవడం కోసం ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది ఇంటి లోపలకు అనుమతించకపోవడంతో అక్కడే ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బైఠాయించారు. శేజల్‌తో పాటు ఆమె వ్యాపార భాగస్వామి ఆదినారాయణ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

అనంతరం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శేజల్‌ను పిలిపించిన మాట్లాడారు. దుర్గం చిన్నయ్యపై లేవనెత్తిన ఆరోపణల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినోద్‌తో పాటు బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. శేజల్ మాత్రం తనకు మంత్రి కేటీఆర్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని, దుర్గం చిన్నయ్య వేధింపులు మొదలైనప్పటి నుంచే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని శేజల్ వారితో చెప్పారు. దుర్గం చిన్నయ్యపై చట్టపరంగా కేసు నమోదు చేసి విచారణ జరపడంతో పాటు పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మాణిక్ రావ్ థాక్రేను కలిసిన శేజల్

ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌కు వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు థాక్రేను కూడా శేజల్ కలిశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం గురించి ఆయనకు వివరించి చెబుతూ.. గత నెల రోజులుగా ఢిల్లీలో వివిధ రూపాల్లో న్యాయం కోసం పోరాడుతున్నానని, తన పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. శేజల్ పోరాటానికి పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement