Tuesday, November 26, 2024

Delhi | బీఆర్ఎస్ ఎంపీలను ఘెరావ్ చేసిన శేజల్.. కార్‌కు అడ్డంగా నిలబడి నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది. గత కొద్ది వారాలుగా దేశ రాజధాని న్యూఢిల్లీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరిజిన్ డైరీ వ్యవస్థాపకురాలు బోడపాటి శేజల్ ఎంపీలను ఘెరావ్ చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బోనాలు ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఎంపీల కార్‌కు అడ్డంగా శేజల్ నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఓ ఆడపిల్ల ఆక్రందన మీకు కనిపించడం లేదా అంటూ గట్టిగా నిలదీశారు. తన ఆవేదన చెప్పుకునేందుకు వస్తే ఏమాత్రం పట్టించుకోకుండా ఎంపీలు వెళ్లిపోవడంపై ప్రశ్నించారు.

శేజల్‌తో పాటు ఆరిజిన్ డైరీలో సహ వ్యవస్థాపకులైన ఆదినారాయణ కూడా కార్‌కు అడ్డంగా నిలబడడంతో చేసేదేం లేక రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేశ్ రెడ్డి కార్ దిగొచ్చారు. అసలేం జరిగిందో తనకు తెలియదని, తనకు వివరాలన్నీ అందజేస్తే న్యాయం అందించే ప్రయత్నం చేస్తానని సర్దిచెప్పారు. అయితే దుర్గం చిన్నయ్య వేధింపులు, బెదిరింపులు నానాటికీ పెరిగిపోయాయని శేజల్, ఆదినారాయణ ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు, బెదిరింపులు తాళలేక శేజల్ ఇప్పటికే రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, అనుక్షణం ఆమె వెంట ఉంటూ కాపాడ్డం తన వల్ల కావడం లేదంటూ ఆదినారాయణ భావోద్వేగానికి గురయ్యారు.

సురేశ్ రెడ్డి కాళ్లపై పడి శేజల్‌ను కాపాడలేకపోతున్నానని, ఎంపీలు చొరవ తీసుకుని న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. ఆ ప్రాంత ఎంపీ వెంకటేశ్ నేత స్పందించాలని, కార్ దిగొచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు. కానీ ఎంపీ వెంకటేశ్ మాత్రం కారు దిగలేదు. సురేశ్ రెడ్డి ఇద్దరినీ సముదాయించి మెల్లగా అక్కణ్ణుంచి బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement