న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆరిజిన్ డైరీ వ్యవస్థాపకురాలు బోడపాటి శేజల్ ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ఎదుట దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోస్టర్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న శేజల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన సరే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపీకి నోటీసులు పంపి 15 రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తెలంగాణలో చర్యలు చేపట్టకపోవడంపై శేజల్ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట మాట్లాడుతూ దుర్గం చిన్నయ్య వేధింపులతో బాధపడుతున్న మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎమ్మేల్యే చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఆయనకు హైదర్‌గూడలో కేటాయించిన ఫ్లాట్ నెంబర్ 404ను బ్రోతల్ హౌస్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. ఆరిజిన్ డైరీ విషయంలోనే కాకుండా ఎమ్మేల్యే, అతని అనుచరులు భీమా గౌడ్, గోలి శివలు చేసిన భూకబ్జాల మీద కూడా విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని అన్నారు. తనపై అన్యాయంగా పెట్టిన తప్పుడు కేసులపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.