న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్య వ్యవహారం చివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వరకు చేరింది. ఎమ్మెల్యేపై వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ ఎండీ బోడపాటి శేజల్ సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శేజల్, తెలంగాణ పోలీసులు తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే సీబీఐను ఆశ్రయించానని చెప్పారు. దుర్గం చిన్నయ్య అధికార పార్టీలో ఉన్నందున పోలీసులకు డబ్బులిచ్చి కేసును తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని శేజల్ ఆరోపించారు.
తెలంగాణ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేకనే సీబీఐని ఆశ్రయించానని అన్నారు. దుర్గం చిన్నయ్య వ్యవహారంపై తాను ఫిర్యాదు చేసినందుకు కక్షగట్టి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె వెల్లడించారు. లైంగిక వేధింపులు సహా తన వద్ద ఉన్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేశానని తెలిపారు. ఆరిజిన్ డైరీ పేరుతో రైతులను మోసగించినట్టు ఎమ్మెల్యే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రైతులను మోసగిస్తే తాను ఢిల్లీ వచ్చి ఎందుకు న్యాయపోరాటం చేస్తానని ఆమె ప్రశ్నించారు.
నిజంగా మోసపోయిన రైతులు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానని, ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా ముందుకు రాలేదని వెల్లడించారు. సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి షేర్లు కేటాయించామని, అలాగే ఎమ్మెల్యే వ్యాపారానికి సహకరిస్తానని, అందుకు ప్రతిఫలంగా తాను చెప్పినవారికి షేర్లు ఇవ్వాలని కోరినందుకు వారికి కూడా ఇచ్చామని చెప్పారు. కానీ వ్యాపారం పేరుతో వేధింపులకు పాల్పడుతున్నందునే ఇంత దూరం రావాల్సి వచ్చిందని శేజల్ తెలిపారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదయ్యే వరకు ఢిల్లీలోనే ఉండి పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.