Tuesday, November 19, 2024

సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు పనుల్లో వేగం.. దాదాపుగా పూర్తి అయిన భూసేకరణ

హైదరాబాద్‌, ఆంద్రప్రభ: కాలం పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడి,అనేక అవాంతరాను ధీటుగా అధిగమించి నిర్మితమవుతున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు సీతమ్మ సాగర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గడువు విధించింది. అనేక సమస్యలతో ఇప్పటికే ఆలస్యమైన ఈ ప్రాజెక్టును 31 డిసెంబర్‌ 2023 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. గత సంవత్సరం మే నెలలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ భూసేకరణ, అంచెనావ్యయం పెరగడం, కేంద్ర అనుమతుల్లో జాప్యంతో పనుల్లో వేగం పెరగలేదు. తొలుత రాజీవ్‌ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్‌ రుద్రం కోట ప్రాజెక్టులుగా దుమ్ముగూడెం గోదావరి జలాలపై ప్రాజెక్టులను ప్రతిపాదించగా ఖమ్మం జిలోని 7 మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలవడంతో ఇందిరా సాగర్‌ నిర్మాణ భూభాగం పశ్చిమ గోదావరి జిల్లాలో కలవడంతో ప్రాజెక్టు ప్రతిపాదనలను పునర్‌ పరిశీలించి రెండు ప్రాజెక్టులను కలుపుతూ సీతమ్మ సాగర్‌ బహుళార్థక ప్రాజెక్టుగా రూపకల్పన చేసి నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

150 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఉన్న దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిసరాల్లో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో నిజాం రాజుకూడా ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధంచేసినా క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. అనంతరం తొలిసారిగా ఏపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్సార్‌ ప్రాజెక్టులనిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అనేక కారణాలతో నిర్మాణ పనులు ముందుకు వెళ్లలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేసీఆర్‌ సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు రీడిజనింగ్‌ చేసి నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటివరు ప్రాజెక్టుకోసం 63 గ్రామాల్లో 3121.14 ఎకరాలు అవసరంకాగా ఇప్పటివరకు 248.15 ఎకరాల భూసెేకరణ జరిగింది. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ. 112.77కోట్లు పరిహారం ఇచ్చింది. అయితే మరో 70 ఎకరాల భూ సేకరణ వివిధ దశల్లో ఉండగా నిధులకొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులకేటాయింపులు ఇచ్చింది.

సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనావ్యయం తొలుత రూ. 2,500 కోట్లు ఉండగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం కావడంతో ప్రస్తుతం 5,000 వేల కోట్లకు మించి పోయింది. ఇకనిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు పొడవు 1,263 మీటర్లు,ఓవర్‌ ప్లో సెక్షన్‌ 109.75 మీటర్లు, నాన్‌ ఓవర్‌ ప్లో సెక్షన్‌ ఎడమవైపు 5మీటర్లు, కుడివైపు 59.7 మీటర్ల సామర్థ్యంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పరివాహక ప్రాంతం 2,81,000 కిలో మీటర్లు ఉండగా 36. 576 టీఎంసీ నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3481.90 కోట్ల పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ప్రస్తుత మున్న దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన 200 మీటర్ల దగ్గర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు 1582.75 మీటర్ల పొడవులో 67 వెంట్స్‌ రేడియల్‌ గేట్ల ను బ్యారేజికి ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించింది.

అలాగే 63.000 మీటర్ల ఎఫ్‌ ఆర్‌ ఎల్‌ వద్ద 36.57 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో 320 ఎండబ్ల్యూ హైడల్‌ పవర్‌ ఉత్పత్తి చేసేందుకు చేసిన ప్రతిపాదనల పనులు వేగం పుంజుకున్నాయి. అలాగే ప్రవాహాల గట్ల తో పాటుగా ఎడమ వైపు 56.684 కిలోమీటర్ల , కుడివైపు 40.61 కిలోమీటర్ల పోడవుతో అప్లక్స్‌ బండ్‌ ప్రతిపాదనలను నీటి పారుదలశాఖ చేసింది. అలాగే వర్ష కాలంలో వరద నీటిని మళ్లించడానికి అన్ని అవసరమైన క్రాస్‌ డ్రైనేజీ పనులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వంతెనలను నిర్మించేందుకు పనుల్లో వేగం పెంచింది. అలాగే జలవిద్యుత్‌ ఉత్పాదనకు రాష్ట్ర జలవనరుల మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 3426.25 కోట్ల సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పనుల్లో వేగం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ సమీక్షిస్తు పనుల్లో వేగం పెంచుతుండటంతో ప్రస్తుత సంవత్సరాంతం నాటికి పూర్తి కాగలదనే నమ్మకం పేరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement