కాశ్మీర్ లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోయలో కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లకల్లోలం స్రుష్టించాలని చూస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందుచేత జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అమర్‌నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఈ ప్రాంతంలో భద్రతను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న ఘటనలను నిరోధించవచ్చు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమర్ నాథ్ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ హత్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే పండిట్లపై దాడులు జరుగుతున్నట్లు వారంటున్నారు.
ప్రజలెవరూ భయాందోన చెందాల్సిన అవసరం లేదని, అమర్‌నాథ్ యాత్ర నిర్వహించడంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్రను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 2.5 లక్షల మంది యాత్రికులు ఆ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. కశ్మీర్ పండిట్లను జమ్మూకు తరలించేది లేదని, 1990 తరహా లాంటి ఘటనలు జరగనివ్వమని, కానీ పండిట్లను లోయలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇటీవల పండిట్లను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్లు కశ్మీర్‌ను వదిలివెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు వేల మంది హిందూ ఉద్యోగులను ఇప్పటికే మరో ప్రాంతానికి తరలించారు.ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కశ్మీర్‌కు 10 లక్షల మంది టూరిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది.