ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: భూములున్న రైతులకు, ఆసాములకు భద్రత కల్పించే విధంగా ధరణి పోర్టల్ ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం సెక్రెటేరియట్‌లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ధరణిపై కమిటీ రిపోర్టు ఆధారంగా ఎలా ప్రక్షాళన చేయాలి, భూములున్న ఆసాములకు, రైతన్నలకు భద్రత ఎలా కల్పిస్తామో అని ఆలోచన చేసి ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు నోటిసుకు వచ్చిన ఓ సమస్యను పరిష్కరించానని చెప్పారు. గతంలో ధరణి పోర్టర్‌లో ఎవరి భూములు ఉన్నాయో చూసుకోవడానికి అవకాశం లేకపోయిందని అన్నారు. తాను రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరి భూములు వారు చూసుకునే విధంగా మార్పు చేశామన్నారు.
పెండింగ్ లో 60,000 దరఖాస్తులు
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 49800 దరఖాస్తులు పరిష్కరించామని, ఇంకా 60,000 దరఖాస్తులను వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలు చెప్పే వారు కాదని, ఇప్పడు ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించినా కారణం తెలియజేయాలని అధికారులను ఆదేశించడమైంది.
10, 254 రెవెన్యూ గ్రామాలు
గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. ఎవరో ఒకరు మాట వినలేదని గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు. రాష్ట్రంలో 10, 254 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అన్నారు. రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూములు కాపాడటానికి, అలాగే రైతులు భూములను గుర్తించే విధంగా రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగిని నియమిస్తామని తెలిపారు. దీనివల్ల రైతులు, పేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
ఎన్ఐసీకి ధరణి పోర్టర్ బాధ్యత
గత ప్రభుత్వం ఒక విదేశీకంపెనీకి ధరణి పోర్టర్ అప్పగించారని మంత్రి తెలిపారు.. అయితే ఈ ఏడాది నవంబర్‌తో ఆ కంపెనీ కాంట్రాక్టు ముగిసింది. కేంద్రానికి సంబంధించిన ఎన్ఐసీకి ధరణి పోర్టర్ అప్పగించనున్నట్లు చెప్పారు.