అమరావతి,ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. ఏప్రిల్ ఎనిమిదో తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొమ్మిదో తేదీ నుండి మాత్రమే సాధారణ ప్రయాణీకులు ఈ రైల్లో ప్రయాణీంచవచ్చు. ఆ రోజు తిరుపతి నుండి సికింద్రాబాద్ వస్తుంది. పదో తేదీన సికింద్రాబాద్ నుండి రాకపోకలు ప్రారంభమౌతాయి. 8.30 గంటల్లోనే ఈ రైలు సికింద్రాబాద్ నుండి తిరుపతి చేరుకుంటుంది. వారంలో ఒక్క మంగళవారం తప్ప అన్ని రోజులూ తిరుపతికి వందే భారత్ రైలు తిరుగుతుంది.
ఈ రైలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి 7.19 నిమిషాలకు నల్గొండ చేరుకొని 9.45 నిమిషాలకు గుంటూరుకు చేరుకొని ఆ తర్వాత 11.09 నిమిషాలకు ఒంగోలుకు వెళ్లి ఆ తర్వాత 12.29 నిమిషాలకు నెల్లూరుకు చేరుకొని అక్కడ నుండి మద్యాహ్నం 2.30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రయాణ టిక్కెట్ ధర ఎగ్జిక్యూటీవ్ ఛైర్‌కార్ రెండు వేలకు పైగా, ఎసి ఛైర్‌కార్ ధర 1150గా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి మద్యాహ్నం 3.15 నిమిషాకలు బయల్దేరి నెల్లూరుకు సాయంత్రం 5.20 నిమిషాలకు, ఒంగోలుకు సాయంత్రం 6.30 నిమిషాలకు, గుంటూరుకు 7.45 నిమిషాలకు, న ల్గొండకు 10.10 నిమిషాలకు, సికింద్రాబాద్‌కు రాత్రి 11.45 నిమిషాలకు చేరుకుంటుంది.