హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రతీ రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ నూతన భవ నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ఉత్తర, దక్షిణ టెర్మినల్స్‌తో పాటు మల్టి లెవల్ కార్ పార్కింగ్, ఎఫ్‌వోబీల ప్రణాళికలు తుది దశలో ఉన్నాయి. పునరాభివృద్ధి పనులలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన టోపోగ్రఫీ, భూసార పరీక్షలు పూర్తి చేసిన తరువాత ప్రయాణికుల సేవలకు ఎలాంటి అంతరాయం కులుగకుండా ప్రధాన భవనాన్ని నిర్మించడానికి వీలుగా తాత్కాలిక కార్యాలయ ఏర్పాటు కోసం పనులు వేగంగా సాగుతున్నట్లు ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. అలాగే, కొత్త ఆర్పీఎఫ్ భవన నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల తాగునీటి అవసరాలను తీర్చడానికి 16 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన భారీ ట్యాంకులు అవసరమని గుర్తించామన్నారు. ఇందుకోసం నూతనంగా నిర్మాణం కానున్న ఉత్తర, దక్షిణ టెర్మినల్స్‌తో పాటు మల్టి లెవల్ కార్ పార్కింగ్, ఎఫ్‌వోబీల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సంబంధిత కాంట్రాక్టర్ రైల్వే ఉన్నతాధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రాబోయే 40 ఏళ్ల కాలంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టామన్నారు. సంబంధిత పనులను అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించిట్లు ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
ప్రసిద్ధ సిక్కు పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీ
బైసాకి మాసంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలులో గురు కృపా యాత్రలో భాగంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు ద.మ.రైల్వే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రయాణికుల కోసం ద.మ.రైల్వే ప్రత్యేక రైలును సైతం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ద.మ.రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో..ఈ పర్యటన లక్నో నుంచి ఏప్రిల్ 5న ప్రారంభమై దేశంలోని 9 ప్రముఖ గురుద్వాల మీదుగా సాగి అదే నెల 15న ముగియనున్నట్లు పేర్కొన్నారు. 678 మంది ప్రయాణించే అవకాశం ఉన్న ఈ ప్రత్యేక రైలులో 9 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 1 ఏసి 3 టైర్, 1 ఏసి 2 టైర్ కోచ్ ఉంటాయనీ మొత్తం 678 మంది సామర్ద్యంతో ప్రత్యేకమైన కోచ్‌లతో సౌకర్యవంతంగా ప్రయాణం సాగుతుందన్నారు. ఈ పర్యటన ప్యాకేజీకి ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుందనీ ప్రయాణ సమయాలలో ముఖ్యమైన గురుద్వారాలలో అన్నదానంలో పాల్గొనే అవకాశం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.