అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. వేసవి సెలవులు పూర్తయ్యేలోగా ఉపాధ్యాయుల బదిలీలు, అర్హులైన వారికి పదోన్నతులు పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 6న బదిలీల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు పూర్తయి, స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూల్యాంకనం పూర్తయిన తర్వాత బదిలీలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. బదిలీలు చేపట్టడానికి ముందుగానే ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్‌లు కల్పించాలని, ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఇప్పటికే నివేదిక పంపినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల పోష్టులు ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా.. ఆర్థిక శాఖ 11 వేల 500 పోస్టులకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ అనంతరం జూన్ 6 నుం ఉపాధ్యాయ బదిలీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాఠశాలల విలీనం విషయంలో ఒక అడుగు ముందుకు వేసిన విద్యాశాఖ కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్స్ మెర్జింగ్ మ్యాపింగ్ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సమీప ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల వివరాలను టీఐఎస్ ద్వారా గుర్తించి, వారి బదిలీల కోసం ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను వేసవి సెలవులు ముగిసేలోగానే పూర్తి చేయాలని, అందుకు జూలై 3ను గడువుగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..