Sunday, November 17, 2024

Second Phase – ప్ర‌శాంతంగా ముగిసిన రెండో ద‌శ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

13రాష్ట్రాల‌లోని 88 లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు
ఉద‌యం నుంచే కేంద్రాల వ‌ద్ద బారులు తీరిన ఓట‌ర్లు
ఓటు హ‌క్కు వినియోగించుకున్న
కేసీ వేణుగోపాల్ రాహుల్ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే
ప్ర‌కాష్ రాజ్, నిర్మ‌లా సీతారామ‌న్, నారాయ‌ణ‌మూర్తి దంపతులు

న్యూఢిల్లీ – లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది..ఓటింగ్ కోసం ఉద‌యం నుంచే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు.. వేస‌వి కావ‌డంతో తొలి రెండు గంట‌ల‌లోనే ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు త‌ర‌లి వచ్చారు. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రిగింది. ఎందుకంటే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపోయారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది. ప‌శ్చిమ బెంగాల‌లో కొన్ని చెదురుముదురు సంఘ‌ట‌న‌లు మిన‌హా మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ ప్ర‌శాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు..

- Advertisement -

ఈ దశలో 1,206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు లొ 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

ఏ ఏ రాష్ట్రాల్లో అంటే ..

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలు, కర్నాటక- 14, రాజస్థాన్‌- 13, మహారాష్ట్ర- 8, ఉత్తర్ప్రదేశ్‌- 8, మధ్యప్రదేశ్‌- 6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లోని చెరో స్థానానికి పోలింగ్ ముగిసింది

బ‌రిలో రాహుల్, హేమ‌మాలిని, శ‌శి ధ‌రూర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు . ప్రముఖ నటి, బీజేపీ నేత హేమమాలిని ఉత్తర్​ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి , రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించిన‌ ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ మీరఠ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

ఇతర కీలక అభ్యర్థులు

రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర కీలక నేతల జాబితాలో కాంగ్రెస్ కీల‌క నేత శశి థరూర్ (తిరువనంతపురం), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (రాజ్‌నంద్‌గావ్), డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పుర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా), వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ (అకోలా), బీజేపీ బంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (బాలూర్‌ఘాట్), అనిల్ ఆంటోనీ (పతనంతిట్ట), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ కుమార్ స్వామి(మాండ్యా), వైభవ్ గెహ్లత్(జలోర్), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం) తదితరులున్నారు.

ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు

అలప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ దంప‌తులు కొచ్చిలో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌ లైన్‌లో నిల్చొని ఓటేశారు. మీరు నమ్మిన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరు పోలింగ్‌లో పాల్గొనాలని ఓటేసిన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ అన్నారు.
బిజెపి బెంగళూరు సౌత్‌ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవద్దని, బయటకు వెళ్లి ఓటు వేయాలని కోరారు

కేంద్రమంత్రి, బెంగళూరు నార్త్‌ అభ్యర్థి శోభా కరంద్లాజె, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ కుటుంబం, పశ్చిమ్‌ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్‌ బోస్‌, కేంద్రమంత్రి, జోధ్‌పుర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా తిస్సూర్‌, పథనంథిట్ట అభ్యర్థులు సురేశ్‌ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ బిహార్‌లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప‌శ్చిమ బెంగాల్ లో బిజ‌పి, తృణ‌మూల్ పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు

లోక్‌సభ ఎన్నికలు 2వ దశ ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్, రాయ్‌గంజ్‌లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మహిళలు ఓటు వేయకుండా కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కి టీఎంసీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో టీఎంసీ- బీజేపీ కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించిన ఆందోళన కొనసాగించారు. ఇక, దాడిపై పోలీసులు అలర్ట్ కావడంతో పాటు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement