హైదరాబాద్, ఆంధ్రప్రభ : రెండో విడత వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండర్ గ్రాడ్యుయేట్ బై.పీ.సీ స్ట్రీమ్ కౌన్సిలింగ్‌ను ఈనెల 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ర్ డాక్టర్ ఎం. వెంకటరమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో కొత్త వ్యవసాయ కళాశాలను, సిద్దిపేట జిల్లా తోర్నాలలో ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోనూ మహబూబాబాద్ జిల్లా మల్యాలలో కొత్త కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. అగ్రికల్చరల్ కాలేజీ తోర్నాలలో 60 సీట్లు- మరియు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మాల్యాలలో 30 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
ఈ నేపథ్యంలో ఈ సీట్లను కూడా రెండో విడత కౌన్సిలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. కొత్త వ్యవసాయ కళాశాల తోర్నాలలో పూర్తిగా వసతులు లేని కారణంగా ప్రస్తుతం వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో తరగతులను ఏర్పాటు చేశామన్నారు. వసతులు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక తోర్నాల కళాశాలకు విద్యార్థులను బదిలీ చేస్తామన్నారు.