Tuesday, November 26, 2024

మంత్రి కొడాలి నాని నోటికి ఎన్నిక‌ల సంఘం తాళం..

అమ‌రావ‌తి – ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రాష్ట్రంలో తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసే ఈ నెల 21వ తేదీ వరకు మీడియా సమావేశాల్లో కానీ, బృందాలతో కానీ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్ లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు ఇవి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్న ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నిన్న షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన మంత్రి తన లాయర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూరితం కాదని, ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టే ఉద్దేశంతోనే మీడియా సమావేశం నిర్వహించానని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు గౌరవం ఉందని, ఎన్నికల కమిషనర్‌ను గౌరవిస్తానని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ గత రాత్రి ఏడు పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి వివరణపై రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన తన వ్యాఖ్యలను తోసిపుచ్చలేదని, వాటిని ఏ ఉద్దేశంతో అన్నానో గుర్తించాలని సలహా ఇచ్చారని అన్నారు. ఆయన వివరణలో ఎక్కడా పశ్చాత్తాపం అన్నది కనిపించలేదన్నారు. ఎన్నికల సంఘంపైనా, కమిషనర్‌పైనా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడిలో భాగమే ఇదని పేర్కొన్నారు. మంత్రి కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎస్‌ఈసీని ప్రతిపక్ష నాయకుడు, మీడియా సంస్థల అధిపతులతో కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, వారిని కుట్రదారులుగా అభివర్ణించారని పేర్కొన్నారు. మంత్రి ఆరోపణలు చేసిన వారిలో ఒకరు ‘పద్మవిభూషణ్’ సహా అనేక గౌరవాలు పొందారని, జాతి గౌరవానికి ప్రతీకలైన అలాంటి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సి ఉందని అన్నారు. తాను సీఎం పతనాన్ని కోరుకుంటున్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంకు, ఆయన కార్యాలయానికి ఎంతో గౌరవం ఇస్తానన్నారు. మంత్రి గత నాలుగైదు నెలలుగా ఎన్నికల సంఘంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినప్పటికీ స్పందించలేదని వివరించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకనే మంత్రిపై చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement