ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల్లో సహకారంపై ఆయా పార్టీల నేతలతో ఎస్ఈసీ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. మరోవైపు, బీజేపీ, జనసేన కూడా ఈ సమావేశానికి హాజరుకాబోమని జనసేన పార్టీ నిన్ననే ప్రకటించింది.
ఎన్నికలపై ముందుగా చర్చించకుండానే షెడ్యూల్ ను ప్రకటించడం పట్ల ఆయా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి వీలుగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
కాగా, ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండడంతో తీర్పు వచ్చాక నోటిఫికేషన్ విడుదల చేస్తారని భావించారు. అయితే అధికారులతో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అవసరమైన చోట్ల మరుసటి రోజు 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలు 10వ తేదీ ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. 10 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. 3 వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.