ఇన్వెస్టర్ల ఫిర్యాదులను స్వీకరించి వాటిని స్కోర్స్ వ్యవస్థ ద్వారా పరిష్కరించే ప్రక్రియను బలోపేతం చేయాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇందు కోసం ఈ వ్యవస్థను ఆన్‌లైన్ వివాద సరిష్కార వ్యవస్థతో కలపాలనే ప్రతిపాదన సిద్ధం చేసింది. ఎండ్ టు ఎండ్ పరిష్కారాన్ని అందించడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్‌లోని ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సమగ్రంగా తీర్చిదిద్దాలని సెబీ భావిస్తోంది. ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని తగ్గించడం, ఇటో రూటింగ్, ఆటో ఎస్కలేషన్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, సమర్ధవంతంగా తీర్చిదిద్దడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని సెబీ తెలిపింది.
సెబీ విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం ప్రస్తుతం ఆటో క్లోజ్‌లో ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ ధరల అవకతవకలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అకౌంటింగ్ అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులను స్కోర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి మినహాయించాలని, దీని కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఇంటెలిజెసన్స్ పోర్టల్‌ను రూపొందించాలని సూచించింది. మదుపర్లు మార్కెట్ ఇంటెలిజిన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులను స్కోర్స్‌లో నమోదు చేస్తే వాటిని మార్కెట్ ఇంటెలిజిన్స్ పోర్టల్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై జూన్ 3లోగా ప్రజలు, ఇన్వెస్టర్లు తమ అభిప్రాయాలను తెలియచేయాలని సెబీ కోరింది. స్కోర్స్‌ను 2011లో జూన్‌లో ప్రారంభించారు. ఇందులో ఇన్వెస్ట ర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసి వాటి పరిష్కారాలను ట్రాక్ చేసుకునే సదుపాయం ఉంది.
వివరించలేని, అనుమానాస్పద ట్రేడింగ్ విధానాలను ఎదుర్కొవడానికి సెబీ ప్రతిపాదించిన నియంత్రణ నిబంధనల ప్రేమ్‌వర్క్, సంక్లిష్ట ఎంటీటీ నిర్మాణాలు, మ్యూల్ ఖాతాల వినియోగం, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వంటి వాటిని గుర్తించేందుకు సాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్రేమ్‌వర్క్ నేరస్థులను చట్టం పరిధిలోకి తీసుకురావడంలో ఒక ప్రధాన దశగా ఉంటుందని ఎస్ ఏఎస్ ఆన్‌లైన్ వ్యవస్థాపకుడులు, సీఈఓ శ్రేయ్ జైన్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి అనైతిక పద్దతుల నుంచి పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడంలో సహాయపడుతుందని చెప్పారు. అనంద్‌రాఠీ వెల్త్ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ ఫిరోజ్ అజీజ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
ఇన్‌పైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించేందుకు కొత్త ప్రేమ్‌వర్క్ దోహదపడుతుందని తెలిపారు. సెబీ 2022లో 3,588 సంస్థలపై అలర్ట్ జనరేషన్ మోడల్ ద్వారా 5000 అలర్ట్‌లు పంపించింది. ఇందులో 97 సంస్థలు, 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు తిరిగి ఇందులో కనిపించాయి. అయితే వాటి ట్రేడింగ్ పాటర్న్‌పై కనెక్షన్లు, కమ్యూనికేషన్లను చూపించడంలో విఫలం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఇప్పుడు తీసుకు వస్తున్న కొత్త మార్కెట్ ఇంటెలిజెన్స్ పోర్టల్‌లో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని సెబీ భావిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిండెన్‌బర్గ్ అదానీ కేసులో సుప్రీం కోర్టు నియంత్రణ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అదనంగా రక్షణ చర్యలపై నియమించిన నిపుణుల కమిటీని కోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో కూడా అదానీ గ్రూప్ కంపెనీలు ట్రేడింగ్ విషయంలో సెబీ లోపం ఉన్నట్లు చెప్పలేమని తేల్చింది.
సెబీ 3,588 సంస్థల ట్రేడింగ్‌పై అలర్టులు పంపించినా, వాటి ట్రేడింగ్ ప్యాటర్న్‌ను మాత్రం రుజువులతో పట్టుకోలేకపోయింది. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా మార్కెట్ నియంత్రణ నిఘా వ్యవస్థలో లోపాటు ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది. ఈ నివేదిక అదానీకి అనుకూలమన్న మీడియా కథనాలతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా లాభపడ్డాయి. వాస్తవానికి సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్ అవకతవకలపై కాదు. కేవలం సెబీ అనుసరిస్తున్న నియంత్రణ విధానాలు, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఉంటే ఎలాంటి అదనపు అధికారాలను ఇవ్వాల్సి ఉంటుందన్న దానిపై మాత్రమే నిపుణుల కమిటీ తన అభిప్రాయాలను కోర్టును సమర్పించింది. తాజాగా సెబీ చర్చకు పెట్టిన ప్రతిపాదిత చర్యలు కూడా సుప్రీం కోర్టుకు నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక లో పేర్కొన్న అంశాల ఆధారంగానే నియంత్రణ, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలను ప్రతిపాదించింది. వీటిని అభిప్రాయాల కోసం చర్చా పత్రాన్ని విడుదల చేసింది.