Friday, November 22, 2024

సెబీకి మరో 3 నెలల గడువు.. అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై విచారణ

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై సెబీ విచారణ మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉంది. విచారణ ముగిసించి, నివేదిక ఇచ్చేందుకు మరో 6 నెలల గడువు కావాలని సెబీ సుప్రీం కోర్టును కోరిన విషయం తెల్సిందే. దీనిపై శుక్రవారం నాడు విచారణ చేపట్టిన సుప్రీం ఆరు నెలలు చాలా ఎక్కువ సమయమని వ్యాఖ్యానించింది. ఈ కేసును సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు పీఎస్‌ నరసిం హ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్నది. ఈ వివాదంలో సామాన్య ఇనెస్టర్లు భారీగా నష్టపోవడంతో నియంత్రణ వ్యవస్థలో ఉన్న లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుప్రీం కోర్టు నియమించిన రిటైర్డ్‌ జస్టీస్‌ ఏఎం సప్రే ఆధ్వర్యంలోని కమిటీ తన ని వేదికను కోర్టుకు అందించిందని తెలిపింది.

ఈ కమిటీ నివేదికపై మే 15న నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అనుమానాస్పద అకౌం ట్లపై లోతుగా విచారణ జరపాల్సి ఉన్నందున సెబీకి మరో 6 నెలల గడువు కావాలని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోతా కోర్టును కోరారు. ఏప్రిల్‌ 29న అదానీ గ్రూప్‌పై విచారణలో అనేక సంక్లిష్టమైన అంశాలు న్నందున విచారణకు మరో 6 నెలల గడువు కావాలని సెబీ సుప్రీం కోర్టును కోరింది. మార్చి2న విచారణ కోసం ఆదేశాలు జారి చేసిన సమయంలో రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. హిండెన్‌బర్గ్‌ నివేదికలో ప్రధానంగా అదానీ గ్రూప్‌ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, డొల్ల కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది.

రుణ భారం భారీగా పెరిగిందని, నిబంధనలు పాటించడంలేదని నివేదిక పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. కంపెనీ మార్కెట్‌ విలువ సగానికి పడిపోయింది. దీంతో అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. మార్కెట్‌లో ఇలాంటి సంఘటనలతో ఏర్పడుతున్న ఒడుదుడుకులను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, నియంత్రణ సంస్థల అధికార పరిధి పెంచాల్సి ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అదానీ కంపెనీల పెట్టుబడులు, లావాదేవీల్లో కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని, ఇవి పూర్తి సంక్లిష్టంగా ఉన్నందున విచారణలో జాప్యం జరుగుతున్నదని, అందుకే గడువుకావాలని సెబీ కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో కోర్టు సెబీకి 3 నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement