అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 టార్గెట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నదన్న దానిపై ప్రతి రోజూ ఆరా తీస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్వ నివేదికలను వడపోస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో అవినీతి ఆరోపణలు, ఒంటెత్తు పోకడలు, కేడర్‌ను కలుపుకోలేక పోతున్నవారు ఇలా నాలుగైదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని 2024 ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తుకు శ్రీకారం చుట్టారు. మునుపెన్నడూ లేని విధంగా పార్టీ బాధ్యతలను తానే నెత్తికెత్తుకుని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నియోజకవర్గాల పరిస్థితులు, అభ్యర్ధుల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు.
ఈ తంతు పూర్తవ్వగానే 2024 ఎన్నికల నిర్వహణకు సంబంధించి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలనే నేను నమ్ముకున్నాను అంటూ ఆయన ప్రతి సభలోనూ చెబుతూ వస్తున్నారు. ఈక్రమంలో ఆయన తనతోటి మిత్రులు అందించే సూచనలు, సలహాలు పాటిస్తూనే తానే సొంతగా వ్యూహాలు రచించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీం నియోజవవర్గాల వారీగా అందించే సమాచారాన్ని ఒక చేత్తో పట్టుకుని, ఇంటిలిజెన్స్, ఢిల్లిd సర్వే వంటి వాటి నివేదికలు మరో చేత్తో పట్టుకుని తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా పార్టీ బాధ్యులు, రీజినల్ కో ఆర్డినేటర్లకు కత్తిమీద సాము లాగా మారింది. స్వయంగా
పార్టీ అధినేతే రంగంలోకి దిగి తాజా పరిస్థితులను తమకు ఎప్పటికప్పుడు చెబుతుండటంతో వారు కూడా యాక్టివ్‌గా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని ..మీరు కష్టపడండి ..మిగతాది నేను చూసుకుంటానంటూ జగన్ చాలా ధీమాగా చెప్పారు. జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసిన మంత్రులు హ్యాపీ ఫీలయ్యారు. అధికారంలోకి వస్తామా రామా అనే అనుమానం ఉన్న నేతలకు జగన్ మాటలతో నమ్మకం పెరిగింది. దీనికి కొనసాగింపుగా ఎన్నికల నిర్వహణ కోసం జగన్ కొత్త ప్లాన్స్ సిద్దం చేస్తున్నారు.
కొత్త ఆలోచనల్లో సీఎం జగన్
రాష్ట్రంలో వచ్చే మార్చి- ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఇప్పటివరకు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే దశలో జరుపుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు దశల్లోనే పోలింగ్ జరిగిన ఆనవాయితీ ఉంది. అయితే, 2019లో అసలు ప్రాబల్యంలేని బిజేపీ రాష్ట్రాల్లో ఐదు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగడం వల్ల భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరిగేలా ఎన్నికల సంఘాన్ని కేంద్రం ఒప్పించగలిగింది. దీనివల్ల ఆరాష్ట్రంలో బిజేపీ సీట్లు-, ఓట్లు- గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు జగన్ ఇదే ఫార్ములానే వచ్చే ఎన్నికలకు అమలు చేయాలని భావిస్తున్నట్లు- తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలోనూ తాను ప్రచారం చేయడమేకాకుండా పార్టీ క్యాడర్‌కు అవసరమైన అండదండలు అందించడం సాధ్యమవుతుందని జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
ప్రతిపక్షాలపై పై చేయి సాధించేలా
ఇలా చేయటం వలన ఎలక్షన్ మేనేజ్‌మెంట్.. పోల్ నిర్వహణలో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల వ్యవహారాలు.. ఎత్తులపై ఫోకస్ చేయటం ఈ మల్టీ ఫేజింగ్ విధానంలో సాధ్యమవుతుందన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, వైసీపీ అభ్యర్థి బలహీనతలను గ-్టట-క్కించడానికి అవసరమైన సమయం ఈ మల్టీ ఫేజింగ్ పోలింగ్ విధానంలో సాధ్యమవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో విడతల వారీగా పోలింగ్ ప్రతిపక్షాల కంటే అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా మారుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక – రాజకీయ పరిస్థితుల్లో విడతల వారీ పోలింగ్ మేలు చేస్తుందనే అంశాన్ని బలంగా నమ్ముతున్నట్లు- తెలుస్తోంది. అందులో భాగంగనే మూడు ప్రాంతాల్లో మూడు దఫాలుగా ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందన్న దానిపై ఆయన సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఢిల్లి టూర్‌లోనూ ఇదే అంశం ప్రస్తావన
ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లి వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆ తరువాత ఢిల్లి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ కూడా ఇదే అంశంపై అమిత్ షాతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఎవరికి లాభం అన్నదానికంటే దీనిని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలన్న దానిపై బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణ అంశం శాంతి భధ్రతల అంశంతో ముడిపడి ఉన్నందున ఎన్నికల కమిషన్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేయలేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది.. ఇది జగన్, చంద్రబాబుల్లో ఎవరికి అనుకూలిస్తుంది.. మధ్యలో బీజేపీ ఏ విధంగా లబ్ది పొందనుంది.. అన్న అంశాలను మాత్రం వేచి చూడాల్సిందే.