Friday, November 22, 2024

Delhi: తెలంగాణ భవన్‌లో గాంధీ చిత్ర ప్రదర్శన.. వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక స్క్రీనింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థులలో దేశభక్తి, పోరాట పటిమను పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశ రాజధానిలో గాంధీ సినిమాను ప్రదర్శించామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గాంధీ సినిమాను తెలుగులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూళ్లకు చెందిన పలు తరగతుల తెలుగు విద్యార్థులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి ప్రదర్శనను ప్రారంభించారు. భవన్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి గౌరవ్ ఉప్పల్ కూడా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఉచితంగా గాంధీ సినిమాను ప్రదర్శించారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ భవన్‌లోనూ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల భవన్‌కు వచ్చి వెళ్లడానికి రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సినిమా చూడడం ద్వారా విద్యార్థులు స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటారని గౌరవ్ ఉప్పల్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement