తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతోపాటు విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు ప్రధాని, తన సోదరుడు అయిన మహింద రాజపక్సేను తొలగించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. అలాగే అఖిలపక్షానికి చెందిన చట్టసభ సభ్యులతో మధ్యంతర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సేతో మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి సంకీర్ణ భాగస్వామ్య ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన శుక్రవారం భేటీ అయ్యారు. రాజపక్సే ప్రభుతంలో భాగసామిగా ఉండి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విభేదించి మద్దతు ఉపసంహరించిన మైత్రిపాల మొదటినుంచి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని మరోసారి రాజపక్సేతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాజా చర్చల వివరాలను వెల్లడించారు. అయితే సంకీర్ణ భాగస్వామ్యంలోని కొన్ని రాజకీయ పక్షాలకు చెందిన అసంతృప్త ఎంపీలు మాత్రం ప్రధాని మహింద రాజపక్సే హాజరైతే గొటబాయతో భేటీకి రాబోమని తేల్చి చెప్పారు. అఖిలపక్షంతో కూడిన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై చర్చించేందుకు రావాలని అధ్యక్షుడు గొటబాయ ఆహ్వానించడంతో మైత్రిపాల కలిశారు. కాగా తదుపరి ప్రధానిని ఎంపిక చేసేందుకు, జాతీయ ప్రభుత్వం రూపురేఖలు ఎలా ఉండాలన్నదానిపై సూచనలు ఇచ్చేందుకు జాతీయ మండలిని నియమించబోతున్నట్లు గొటబాయ చెప్పారని మైత్రిపాల తెలిపారు. ప్రధానికి పదవికి రాజీనామా చేయబోనని మహింద రాజపక్సే మొండిగా వ్యవహరిస్తుండగా ప్రజల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో గొటబాయ చొరవ తీసుకుని చర్చల ప్రక్రియ ప్రారంభించారు.
రాజపక్సే కుటుంబ సభ్యుల వైఫల్యం వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆరోపిస్తూ సంకీర్ణ ప్రభుతంలోని భాగసామ్య పక్షాలు, సొంత పార్టీకి చెందిన 40మంది చట్టసభ సభ్యులు కొద్దివారాల క్రితం మద్దతు ఉపసంహరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మైనారిటీలో ఉన్న రాజపక్సే ప్రభుతం దిగిపోవాలని అటు ప్రజలు, ఇటు విపక్షాలు, అధికారపక్షంలోని అసంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక పదవులన్నీ రాజపక్సే కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని, వారి వైఫల్యం వల్లే దేశం గడ్డుస్థితిలోకి నెట్టివేయబడిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజీనామా చేయాలని, అఖిలపక్షాలతో కూడిన మధ్యంతర ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఒకవైపు ప్రజల నిరసనలు తీవ్రమవుతూండగా విపక్షాలు ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దేశాధ్యక్షుడు చొరవ తీసుకున్నారు. చర్చలకు రావాలంటూ విపక్ష, సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. మద్దతు ఉపంసహించిన సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్త ఎంపీలను మళ్లి చేరాలని కోరారు. కాగా దేశాధ్యక్షుడు గొట్టబాయ రాజీనామా చేయాలని, ప్రస్తుత ప్రభుతం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ప్రజల ఆందోళనలు తీవ్రతరమైనాయి. గురువారం వెయ్యి కార్మిక సంఘాలు సారత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో దేశం స్తంభించిపోయింది. శుక్రవారం కూడా నిరసనలు పెల్లుబుకాయి. ప్రధాని మహింద, అధ్యక్షుడు గొటబాయ గో హోమ్ టూ నినదిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..