కీవ్:రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార పదార్థాలు, గోధుమలు, వంటనూనెల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆహార సంక్షోభం ఏర్పడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం కొన్ని సానుకూల పరిణామాలు సంభవించాయి. నల్లసముద్రం, అజోవ్ సముద్ర తీరాల్లోని ఉక్రెయిన్ పోర్టుల్లో అనేక సరకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకునే గోధుమల్లో పది శాతం ఒక్క ఉక్రెయిన్‌నుంచే ఎగుమతి అవుతున్నాయి. నల్లసముద్రం మీదుగా వీటిని రవాణా చేస్తున్నారు. ఉక్రెయిన్ ఆదాయ వనరుల్లో నల్లసముద్రం కీలకం. ఉక్రెయిన్ పోర్టుల్లో ప్రస్తుతం నిలిచిపోయిన నౌకల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల గోధుమలు, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాలు, నూనెలు, ఇతర ఆహార పదార్థాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి 91 రోజులైంది. అప్పటినుంచి ఈ నౌకలు ఉక్రెయిన్‌లోని పలు పోర్టుల్లో నిలిచిపోయాయి. ప్రపంచంలోని గోధుమ, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో మూడోవంతు రష్యా, ఉక్రెయిన్‌లే ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి ఉత్పత్తులపైనే అనేక దేశాలు ఆధారపడ్డాయి. యుద్ధం నేపథ్యంలో పదుల సంఖ్యలో రవాణా నౌకలు లంగరు వేశాయి. భద్రత నేపథ్యంలో వాటిని ఉక్రెయిన్ కదలనివ్వలేదు. రష్యా కూడా ఆ నౌకలను కదలనివ్వడం లేదు. అటు రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాలు, పదార్థాల రవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. ఈ పరిణామాలపై అటు ఐరాస కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా ఉక్రెయిన్ పోర్టుల్లో నిలిచిపోయిన ఆహార ధాన్యాల రవాణా నౌకలను సురక్షితంగా తరలించేందుకు కారిడార్‌ను ఏర్పాటు చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. నల్లసముద్రం పరిధిలోని దేశాలు రక్షణలో ఆ నౌకలు సాఫీగా ప్రయాణించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహా ఈయూ దీనిపై చర్చలు ప్రారంభించింది. మరోవైపు భద్రత కల్పిస్తే ఎగుమతులకు పచ్చజెండా ఊపేందుకు ఉక్రెయిన్ సిద్ధంగానే ఉంది. తాజా పరిణామాల పట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూడా రష్యా కాస్త సానుకూలంగానే స్పందించింది. అయితే కొన్ని షరతులు విధించింది. యుద్ధం నేపథ్యంలో తమపై విధించిన ఆంక్షలను సడలిస్తే సరకు రవాణా నౌకలు కదలివెళ్లడానికి సహకరిస్తామని ప్రకటించింది. మొత్తంమీద అతి త్వరలో ఉక్రెయిన్‌లోని నల్లసముద్రం, అజోవ్ పోర్టుల్లో నిలిచిపోయిన సరకు రవాణా నౌకలు కదిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పోర్టుల్లో నిలిచిపోయిన నౌకలను కదలనీయకపోతే పేద దేశాల ప్రజలు ఆకలితో అలమటిస్తారని, ఇప్పటికే వారు ఆహార సంక్షోభంలో కూరుకుపోయారని ప్రపంచ ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.