హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు అకాల వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు మండే ఎండలతో సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం పలు ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పొడివాతావరణం నెలకొననుందని వాతావారణశాఖ పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35డిగ్రీల కంటే తక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా సోమ, మంగళవారాల్లో అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను చేరాయి. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు కనీసం 3 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, భద్రాచలం-కొత్తగూడెంలో, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మంలో దాదాపు 40 డిగ్రీల పగటిఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో దాదా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు…
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం-ఆసీఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
40ఏళ్లలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు..
మండు వేసవిలో కురిసిన అకాల వర్షాలు రికార్డు స్థాయిలో పంట నష్టం చేయడమే కాదు ఈ ఏడాది వర్షాపాతం కూడా రికార్డుస్థాయిలో నమోదైంది. గత 40ఏళ్ల చరిత్రలో లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. 2022-23 (జూన్ , మే) నమోదైన వర్షపాతం గత రికార్డులను తుడిచిపెట్టేసింది. సాధారణ వర్షపాతం కన్నా 54శాతం అధికంగా నమోదైంది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 908.3 మిల్లి మీటర్లు కాగా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే 5 నాటికి 1359.7 మిల్లిdమీటర్లు కురిసింది. 1983-84లో సాధారణం కన్నా 51శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. ఆ సంవత్సరంలో సాధారణ వర్షపాతం 892.8మిల్లి మీటర్లకు 1351.1 మిల్లిdమీటర్లు కురిసింది. ఆ తర్వాత 2022-23 సంవత్సరంలో 54.4శాతం వర్షాలు నమోదయ్యాయి.
వాతావరణశాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం 1951-52 నుంచి వివరాలను పరిశీలిస్తే 1989-90 మే నెలలో మాత్రమే 577శాతం వర్షపాతం నమోదైంది. అప్పుడు సాధారణ వర్షపాతం 25.8 మి.మీకుగాను 174.7 మి.మీ. కురిసింది. దీనికి భిన్నంగా ఈ ఏడాది మే నెలలో సాధారణ వర్షపాతం 2.6 మి.మీకుగాను ఇప్పటికే 39.3 మి.మీ కురిసి 1412 శాతం నమోదైంది. గతేడాది జులైలో 121శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ మార్చిలతో 413శాతం, ఏప్రిల్‌లో 338శాతం అధికంగా నమోదయ్యాయి.