వచ్చే నెల జనవరి నుంచి కార్ల ధరలను 3 శాతం మేర పెంచుతున్నట్టు వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ప్రకటించింది. అన్ని ఉత్పత్తుల రేంజ్‌ల ధరలు పెంచుతున్నట్టు పేర్కొంది. జనవరి 1, 2022 ధరల పెంపు అమల్లోకి వస్తుందని వివరించింది. కాగా స్కోడా కంపెనీ కుషక్, కొడియాక్, ఒక్టావియాతోపాటు పలు కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇన్‌పుట్ వ్యయాలు, కార్యకలాపాల వ్యయాలు పెరగడంతో వాహన ధరలు పెంచాలని నిర్ణయించినట్టు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సవాళ్లు ఉన్నప్పటికీ కస్టమర్లపై పూర్తి భారం పడకుండా చూసుకుంటున్నాం. ధరల పెంపు కనిష్ఠంగా ఉండేలా చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. కాగా వాహనరంగానికి అత్యంత కీలకమైన స్టీల్, అల్యూమినియం, కాపర్, విలువైన మెటల్స్ ధరలు గతేడాదికాలంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహన తయారీ కంపెనీలపై ముడిపదార్థాల భారం పెరిగిపోయింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ వంటి కారుతయారీ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital