కేసులలో నిందితుల అరెస్ట్ పై ఆంక్షలు
ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి చేసిన సుప్రీం కోర్టు
సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారం ఈడీ లేదంటూ స్పష్టం
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విశిష్ట అధికారాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోత విధించింది. మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టులకు సంబంధించి ఈడీ దూకుడుకు బ్రేకులు వేసింది. మనీలాండరింగ్ ఫిర్యాదులకు సం బంధించిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది.
ఈడీ కేసులలో నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే.. ఈడీ తప్పనిసరిగా ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 45కి సంబంధించి ‘ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్’పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధానాంశాలు
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 44 కింద దాఖలైన ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఆ కేసుల్లో నిందితుడిని సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉండదు. ఇలాంటి కేసుల్లో ప్రత్యేక కోర్టు నిందితుడికి తప్పనిసరిగా సమన్లు జారీ చేయాలి. కోర్టు నోటీసులకు నిందితుడు సమాధానమిచ్చినట్లయితే, అప్పు డు నిందితుడు కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదు. కాబట్టి, నిందితుడు ప్రత్యేకంగా బెయిల్‌కు దరఖా స్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి కేసుల్లో నిందితుడు పీఎంఎల్‌ఏ సెక్షన్ 45లోని ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్‌ను సంతృప్తి పర్చాల్సిన అవసరమూ ఉండదు.
ఒకవేళ, కోర్టు నోటీసులకు నిందితుడు సమాధానం ఇవ్వకుంటే, అరెస్టు వారెంట్ జారీ చేయాలి. తొలిసారి జారీ చేసే వారెంట్ బెయిలబుల్ వారెంట్‌గా ఉండాలి. కోర్టు విచారణకు హాజరైన నిందితుడిని దర్యాప్తులో భాగంగా ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే.. అప్పుడు ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఈడీ చూపించిన కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్ విచారణకు అనుమతినివ్వాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.