Monday, November 25, 2024

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కర్తలకు నోబెల్‌.. శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు అత్యున్నత పురస్కారం

మెడిసన్‌ లేదా ఫిజియోలజీలో 2023 సంవత్సరానికి గాను శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ నోబెల్‌ పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు. కొవిడ్‌-19 వైరస్‌కు వ్యతిరేకంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినందుకు వారిద్దరినీ నోబెల్‌ పురస్కరానికి ఎంపిక చేసినట్టు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ పురస్కార కమిటీ సోమవారం ప్రకటించింది.

న్యూక్లియోసైడ్‌ ఆధారిత మార్పులు చేయడం ద్వారా కొవిడ్‌ వైరస్‌కు వ్యతిరేకంగా అత్యంత సమర్ధమంతంగా పనిచేసే వ్యాక్సిన్లను ఉభయులు ఆవిష్కరించారని కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. వారి ఆవిష్కరణతో మన వ్యాధి నిరోధక శక్తితో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యవహార శైలి పట్ల మనకు ఉన్న అవగాహన పూర్తిగా మారిపోయిందని తెలిపింది. ”అధునాతన కాలంలో మానవాళి ఆరోగ్యానికి పెను ముప్పు ఎదురైనప్పుడు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో నోబెల్‌ పురస్కార విజేతలు అనూహ్యమైన పాత్ర పోషించారు” అని నోబెల్‌ పురస్కార కమిటీ కొనియాడింది.

కాటలిన్‌ కరికొ నేపథ్యం

నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన కాటలిన్‌ కరికొ హంగేరిలోని జోల్‌నోక్‌లో 1955లో జన్మించారు. 1982లో జెగెడ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆమె పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలోని హంగేరియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఆమె 1985 వరకు పోస్ట్‌డాక్టోరల్‌ రీసేర్చ్‌ చేసారు.

1989లో పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013 వరకు అదే ఉద్యోగంలో కొనసాగారు. అనంతరం బయోఎన్‌టెక్‌ ఆర్‌ఎన్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌లో తొలుత వైస్‌ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాత సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2021 నుంచి జెగెడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్‌ మెన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

డ్రూ వెయిస్‌మన్‌ నేపథ్యం

వెయిస్‌మన్‌ 1959లో మస్సాచుసెట్ట్‌స్‌లోని లెక్జింగ్‌టన్‌లో జన్మించారు. 1989లో బోస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎండీ, పిహెచ్‌డీ పట్టాలను అందుకున్నారు. హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌లోని బేత్‌ ఇజ్రాయెల్‌ డెకొనెస్‌ మెడికల్‌ సెంటర్‌ వద్ద క్లినికల్‌ ట్రైనింగ్‌ చేశారు. నేషనల్‌ ఇన్‌స్ట్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ వద్ద పోస్ట్‌డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు. 1997లో పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్‌ మెన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌లో తన పరిశోధక బృందాన్ని వెయిస్‌మన్‌ నెలకొల్పారు.

13 ఏళ్ల క్రితం పట్టాలెక్కిన ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ

ఎన్‌ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై ఔషధ తయారీ రంగం ఆసక్తి 2010లో ఊపందుకోవడం మొదలైంది. పలు కంపెనీలు ఆ విధానాన్ని అభివృద్ధి చేయడంపై కసరత్తు ప్రారంభించాయి. జైకా వైరస్‌, ఎంయీఆర్‌ఎస్‌-సీవోవీలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. రెండవ వైరస్‌ ఎస్‌ఏఆర్‌స్‌-సీవోవీ-2 వైరస్‌కు అత్యంత సన్నిహితమైంది. 2020 మొదట్లో కొవిడ్‌-19 మహమ్మారి యావత్‌ మానవాళిని చుట్టుముట్టడంతో ఎస్‌ఏఆర్‌స్‌-సీవోవీ-2 ప్రొటీన్‌ గుట్టు రట్టు చేస్తూ మూలంలో మార్పులతో కూడిన రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను రికార్డు స్థాయి వేగంతో అభివృద్ధి చేశారు. అదే డిసెంబర్‌ మొదట్లో రెండు వ్యాక్సిన్లకు ఆమోదం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement