Tuesday, November 26, 2024

సూర్యుని కన్నా పదిరెట్ల పెద్ద కృష్ణబిలం.. భూమికి చేరువలోనే ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు

భూమికి అతి చేరువలో ఉన్న ఓ రాకాసి కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గతంలో భూమికి దగ్గరగా ఉన్నదని భావించిన దానికన్నా మూడురెట్లు చేరువగా, మరింత పెద్దదిగా ఈ కృష్ణబిలం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. పైగా ఇది సూర్యుడికన్నా ఏకంగా పదిరెట్ల పెద్దదిగా ఉందని తేల్చారు. రాయల్‌ ఆస్ట్రానమికల్‌ సొసైటీ తాజా మాసపత్రికలో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. పాలపుంతలో కృష్ణబిలాలు ఓ విలన్‌లలాంటివి. దాని సమీపంలోకి వచ్చే దేనినైనా మింగేస్తాయి. చివరకు తోటి, సాటి నక్షత్రాలనైనా సరే. అంతెందుకు.. కాంతి కూడా వాటిలోంచి ప్రయాణించడం సాధ్యం కాదు. నక్షత్రాలు జీవాన్ని, శక్తిని కోల్పోయినప్పుడు ఇలా కృష్ణబిలాలు ఏర్పడతాయి. ఎటువంటి శక్తి ఉద్భవించకపోవడం, కాంతిని కోల్పోవడం, రేడియేషన్‌ లేకపోవడం వల్ల వాటిని గుర్తించడం కూడా కష్టమే. అయితే, తాజాగా కనుగొన్న రాకాసి కృష్ణబిలం భూమికి అతి దగ్గరగా ఉన్నదిగా గుర్తించారు. గతంలో భూమికి చేరువుగా ఉన్నదని గుర్తించిన కృష్ణబిలం కన్నా ఇది మరింత దగ్గరగా ఉండటం గమనార్హం. కృష్ణబిలాల్లో ఉండే ద్రవ్యరాశి సూర్యుడికన్నా 5 నుంచి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కనుగొన్న కృష్ణబిలం సూర్యుడికన్నా పదిరెట్లు పెద్దదిగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఖగోళ భూమధ్య రేఖకు 1600 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వారు తేల్చారు.

తాజా పరిశోధనల ప్రకారం భూమికి అత్యంత చేరువలో ఉన్న కృష్ణబిలం ఇదే. హవాయిలోని ఇంటర్నేషనల్‌ జెమిని అబ్జర్వేటరీలోని జంట టెలిస్కోపుల్లో ఒకటైన జెమిని నార్త్‌ టెలిస్కోప్‌ను ఖగోళ శాస్త్ర వేత్తలు ఉపయోగించి అంతరిక్షం అణువణువూ పరిశీలించారు. సూర్యుడిలాంటి ఓ నక్షత్రం ఈకృష్ణ బిలం చుట్టూ పరిభ్రమిస్తున్న విషయాన్ని గుర్తించారు. సూర్యుడి చుట్టూ భూమి ఎంత దూరంలో ఉందో, దానిచుట్టూ ఎలా తిరుగుతున్నదో, అదే తీరులో కృష్ణబిలానికి అంతే దూరంలో ఆ నక్షత్రం పరిభ్రమిస్తున్నట్లు కనుగొన్నారు. ఇలా ఒక కృష్ణబిలం చుట్టూ ఓ నక్షత్రం పరిభ్రమిస్తున్న విషయం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఈ అధ్యయన పత్రాన్ని రూపొందించిన ప్రధాన శాస్త్రవేత్త, ఆస్ట్రో ఫిజిసిస్ట్‌ కరీమ్‌ ఎల్‌ బాద్రి పేర్కొన్నారు.

నిజానికి యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన గాయియా స్పేస్‌ క్రాఫ్ట్‌ అందించిన డేటాను విశ్లేషించిన తరువాత శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగింది. దాంతో జెమిని మల్టిd ఆబ్జెక్ట్‌ స్పెక్టోగ్రాఫ్‌ ఇన్‌స్ట్ర్‌మెంట్‌ను వినియోగించి పరిశోధన లు కొనసాగించారు. ఆ కృష్ణబిలంలోని మధ్యభాగంలో సూర్యుడి కన్నా పదిరెట్ల ద్రవ్యరాశి ఉన్నట్లు గుర్తించారు. అయితే, శక్తివిహీన దశలో అదంతా ఉంది. ఒకప్పటి భారీ నక్షత్రం విస్ఫోటనం చెంది కృష్ణబిలంగా మారిపోయింది. అంతకుముందు కొన్ని లక్షల సంవత్సరాలు నక్షత్రంగా వెలుగొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement