తెలంగాణలో సుదీర్ఘ విరామం తర్వాత విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా దాదాపు 16 నెలల క్రితం స్కూళ్లు, కాలేజీల్లో ఆగిపోయిన ప్రత్యక్ష బోధన బుధవారం నుంచి పునఃప్రారంభం అవుతున్నది. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయరాదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? ప్రత్యక్షంగానా? అనేది ఆయా విద్యాసంస్థలు, విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు పేర్కొన్నది.
ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను కోర్టు ఆదేశాల మేరకు మరికొంత కాలం మూసి ఉంచుతున్నట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సమాంతరంగా ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధానంలోనైనా తరగతులకు హాజరుకావొచ్చు. ఇంటర్, డిగ్రీ సహా అన్ని రకాల కాలేజీల్లో మాత్రం ప్రత్యక్ష తరగతులే నిర్వహిస్తారు. 40 వేల పైచిలుకు స్కూళ్లలోని 60 లక్షల మంది విద్యార్థులు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ తరగతులకు హాజరుకానున్నారు. 1,800 జూనియర్ కాలేజీల్లోని 9 లక్షల మంది విద్యార్థులు, 955 డిగ్రీ కాలేజీల్లోని 4.5 లక్షల మంది, వృత్తి విద్యాకోర్సుల్లోని ఐదు లక్షల మంది విద్యార్థులు కేవలం ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం మార్గదర్శకాలు విడుదలచేశారు.
ఇది కూడా చదవండి: కత్రినా, హృతిక్ సెల్ఫీని తిరస్కరించిన జొమాటో డెలివరి బాయ్స్..