కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా కోజికోడ్ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలు, ట్యూషన్ సెంటర్లతో పాటుగా అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న బేపోర్ హార్బర్లో కార్యకలాపాలను తదుపరి ఆదేశాలను ఇచ్చేంతవరకు నిలిపివేస్తున్నట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలి కాలంలో నిఫా వైరస్ వ్యాప్తికి కారణమై మృతి చెందిన మొట్టమొదటి రోగిని గుర్తించినట్టు ప్రభుత్వం తెలిపింది.
రోగిని కనిపెట్టడం కోసం ప్రభుత్వం మొబైల్ టవర్ లొకేషన్లను తీవ్రంగా ట్రాక్ చేసింది. వైరస్ సోకిన కారణంగా సదరు రోగి ఆగస్టు 30న మరణించాడు. అతడి కారణంగా వైరస్ సోకిన అతడి కుమారుడు, బావమరిది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు చేయించుకున్న 94 మందికి వైరస్ నెగిటివ్ అని తేలిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
నిఫా వైరస్ సోకిన ఆరవ వ్యక్తిని వెదకడంపై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టింది. కాగా మొట్టమొదటి వైరస్ సోకిన వ్యక్తి ప్రయాణించిన ప్రాంతాలన్నింటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్టు కోజికోడ్ నగర మేయర్ బీనా ఫిలిప్ తెలిపారు. వచ్చే వారం రోజులపాటు తరగతులను ఆన్లైన్లో నిర్వహించాల్సిందిగా కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా విద్యాసంస్థలను ఆదేశించారు.