Tuesday, November 26, 2024

శ్రీలంకలో స్కూళ్లు, ప్రభుత్వాఫీసులు బంద్‌.. ఎందుకో తెలుసా!

కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో నే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలను బంద్‌ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం టీచర్లు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఈ సందర్బంగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే దేశానికి వస్తున్న దిగుమతులకు డబ్బులు చెల్లించడానికి లంక ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో ఇంధన నిల్వలు కూడా వేగంగా కరిగిపోతున్నాయి. దాంతో పెట్రోల్‌ , డీజిల్‌ కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ”ప్రస్తుతం దేశం లో ఉన్న పరిమిత ఇంధన సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.


ప్రజా రవాణా వ్యవస్థ, ప్రయివేటు వాహనాలు నడపడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అతి తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చేందుకు ఈ సర్క్యులర్‌ అనుమతిస్తోంది” అంటూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ , హోం ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఆదేశాలు విడుదల చేశాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే వాళ్లు మాత్రం ఉద్యోగాలకు రావల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. కొన్ని నెలలుగా శ్రీ లంకలో ప్రతిరోజు సుమారు 13 గంటలపాటు కరెంటుకోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ ఖజానాను కాపాడుకునేందుకే ఇక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రయివేటు కంపెనీల టర్నోవర్‌ను బట్టి 2.5శాతం సోషల్‌ కంట్రి బ్యూషన్‌ ట్యాక్స్‌ విధించడానికి కూడ లంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement