Monday, November 18, 2024

పాఠశాల విద్య కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేత.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నవాటి గుర్తింపును ఎందుకు ఉపసంహరించరాదో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులను ఆదేశిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి కొలసాని తులసీ విష్ణుప్రసాద్‌, మరికొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు.

ఉచిత విద్యాహక్కు చట్టం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు వర్తించవన్నారు. ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సాయం పొందటంలేదని సుప్రీం కోర్టు కూడా 2012లో వెలువరించిన తీర్పులో ఇదే అశాాన్ని ప్రస్తావించిందని గుర్తుచేశారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ విద్యాశాఖ కమిషనర్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి వరకు 20 కంటే తక్కువ ఉన్న, అడ్మిషన్లు లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేసేందుకు ఆయా పాఠశాలలకు కమిషనర్‌ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన సంగతి విదితమే. కాగా తదుపరి విచారణ జూన్‌ 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement