హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎస్‌సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)లో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 నుంచి 55 మంది ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో ఎస్‌సీఈఆర్టీపై అనేక విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్లు, రాతపరీక్షలు లేకుండా, వర్క్ డిప్యూటేషన్, ఓరల్ డిప్యూటేషన్ పేర్లతో సుమారుగా 55 మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు.
వీరంతా 10 నుంచి 20 ఏండ్ల నుంచి అక్కడే పాతుకుపోయారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవారేనని సమాచారం. నాటి కొంత మంది మంత్రులు, సీఎంఓ సిఫారసులతో ఏండ్ల నుంచి పాఠశాలల్లో విధులు నిర్వహించకుండా ఇక్కడే పాతుకుపోయారనే ప్రధాన ఆరోపణలున్నాయి. ఎవరైనా 5 ఏళ్లకు మించి ఎక్కువ రోజులు డిప్యూటేషన్‌పై ఉండొద్దు.
కానీ వీరంతా ఏళ్ల తరబడిగా ఎస్‌సీఈఆర్టీలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ డిప్యూటేషన్లను రద్దు చేసి కొత్తగా నియామకాలను చేపట్టాలనే భావనలో ప్రభుత్వం ఉన్నది. ఇటీవలే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్‌సీఈఆర్టీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఆయన దృష్టికి డిప్యూటేషన్ల అంశం వెళ్లింది. ఈక్రమంలోనే అక్కడ పనిచేసే వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్లపై ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడికే పోవాల్సి ఉంటుందని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు.