Tuesday, November 26, 2024

ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు నిర్దేశిత సంవత్సరంలో ఖర్చు చేయాలి.. మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరిక

అమరావతి, ఆంధ్రప్రభ: ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను హెచ్చరించారు. సబ్‌ ప్లాన్‌ ఖాతా కింద ఖర్చు చేసే ప్రతి కూడా ఎస్సీలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ఎస్సీల సంక్షేమం విషయంలో సీఎం జగన్‌ ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టాలన్నారు. ఉద్యానవన, రోడ్డు భవనాల శాఖలతో సహా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద వచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు చేయని కారణంగా కోట్లాది రుపాయల నిధులు మురిగిపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ నిధులను పూర్తిగా ఎందుకు వినియోగించుకోలేకపోయారనే విషయంగా సంబంధిత అధికారులను సంజాయిషీ అడుగుతామని మంత్రి చెప్పారు. ఎపీసచివాలయంలో బుధవారం ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల వినియోగంపై జరిగిన నోడల్‌ ఏజెన్సీ తొలి విడత సమావేశంలో నాగార్జున అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌లో కేటాయించిన నిధులను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఖర్చు చేయాల్సి ఉంటు-ందని, ఒక ఏడాదిలో ఖర్చు కాని నిధులను మరో సంవత్సరంలో వినియోగించుకునే అవకాశం ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులు ఉండి కూడా వాటిని ఖర్చు చేయలేని ప్రభుత్వ శాఖలు ఆ నిధులను ఎస్సీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించాలని సూచించారు.

ఎస్సీల సమగ్రాభివృద్ధి కోసం సీఎం జగన్‌ ఆలోచిస్తున్న విధంగానే వారి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను సబ్‌ ప్లాన్‌ నిధులతో చేపట్టాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖల పనితీరును సమీక్షిస్తూ, సబ్‌ ప్లాన్‌ నిధులతో అమలు చేస్తున్నప్పుడు అందులో ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎస్సీల సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని కోరారు. సబ్‌ ప్లాన్‌ నిధులతో ఏ కార్యక్రమాలను చేపడుతున్నారనే విషయంగా ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుగానే వాటికి నోడల్‌ ఏజెన్సీలో ఆమోదం పొందాలని కోరారు. నిధులను ఖర్చు చేయని శాఖల నుంచి ఆ నిధులను అవసరమున్న ఇతర శాఖలకు పున: కేటాయింపులు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement