Tuesday, November 26, 2024

Maha crisis: అనర్హత అసాధ్యమన్న షిండే వర్గం.. సుప్రీంకు చేరిన లొల్లి

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా అట్లాగే కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటుదారు ఏక్​నాథ్​ షిండే క్యాంపుల మీద క్యాంపులు మారుస్తున్నారు. కాగా, ఈ నేపథ్యంలోనే నిన్న డిప్యూటీ స్పీకర్​ జారీ చేసిన 16మంది ఎమ్మెల్యేల అనర్హత నోటీసుపై, శాసనసభాపక్షనేతగా అజయ్​ చౌదరిని నియమించడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఏక్​నాథ్​ షిండే వర్గం సుప్రీంలో వేసింది. కాగా, ఈ పిటిషన్లను ఇవ్వాల (సోమవారం) ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు వెకేషన్​ బెంచ్​, రిజిస్ట్రార్​ షిండే క్యాంపు అభ్యర్థనలపై విచారణ జరిపే అవకాశం ఉంది..

ఇక.. తనపై ఉన్న అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్య తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ షిండే చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. షిండే మరియు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు చాలామంది జూన్ 21న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తొలుత గుజరాత్​లో క్యాంపు పెట్టి ఆ తర్వాత ప్రస్తుతం అస్సాంలోని గౌహతిలో ఉన్న క్యాంపులో వారంతా ఉన్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి శివసేన వైదొలగాలన్నది తిరుగుబాటు ఎమ్మెల్యేల  ప్రధాన డిమాండ్. అంతేకాకుండా తన తొలగింపు తీర్మానం పెండింగ్‌లో ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఏ సభ్యుడిని అనర్హులుగా ప్రకటించలేరని, అజయ్ చౌదరి, సునీల్ ప్రభులను శివసేన లెజస్లేటర్​ పార్టీ (SSLP) నాయకుడు, చీఫ్ విప్‌గా గుర్తించడంలో అతని చర్య చట్టవిరుద్ధమని న్యాయవాది అభినయ్ శర్మ ద్వారా దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొన్నారు.

శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా సవాల్ చేస్తూ తిరుగుబాటు నేతలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా షిండే పెద్ద సంఖ్యలో విశ్వసనీయ ఎమ్మెల్యేలతో ముంబైని విడిచిపెట్టిన ఒక రోజు తర్వాత, షిండేని తొలగించిన సేన.. ఆ పదవిలో చౌదరిని నియమించింది.

శివసేన న్యాయవాది ఏం అంటున్నారంటే..

- Advertisement -

ఇదిలావుండగా.. శివసేన సీనియర్ న్యాయవాది అడ్వకేట్ దేవదత్తా కామత్ మాట్లాడుతూ.. “విలీనం జరిగితేనే మూడింట రెండొంతుల (ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించడం) అనే భావన వర్తిస్తుంది. ఎమ్మెల్యేలు మరో పార్టీలో విలీనం కానంత వరకు అనర్హత వర్తించదు. నేటి వరకు వారు ఏ పార్టీలో విలీనం కాలేదు. వారు స్వచ్ఛందంగానే వదిలి వెళ్లారు” అన్నారు.

“రాజ్యాంగం ప్రకారం స్పీకర్ లేనప్పుడు స్పీకర్ యొక్క అధికారం డిప్యూటీ స్పీకర్‌కు ఉంటుంది. అటువంటి విషయాలపై తీర్పు చెప్పవచ్చు. తిరుగుబాటుదారులకు ఇమెయిల్ ద్వారా అవిశ్వాస తీర్మానం పంపించాం”అని వివరించారు.

నిపుణులు ఏం అంటున్నారంటే..

దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వివరణ ఇస్తూ.. ‘‘ప్రభుత్వం సభలో మెజారిటీ కోల్పోనంత కాలం గవర్నర్ సాధారణంగా కేబినెట్ సలహాకు కట్టుబడి ఉంటారని.. రాష్ట్రపతి ఎన్.సంజీవ రెడ్డి చౌదరి, చరణ్ సింగ్ సలహా మేరకు నడుచుకున్నారు.  అసెంబ్లీని సమావేశపరిచి తన మెజారిటీని నిరూపించుకోవలసిందిగా సీఎంను అభ్యర్థించాలని గవర్నర్‌కు సూచించారు.”

ఇక.. రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ.. “రాజ్యాంగం ప్రకారం.. ఈ విషయంలో ఎవరికీ పూర్తి అధికారం లేదు. గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 (2) ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీకి సందేశం పంపడం అతని హక్కుల పరిధిలో ఉంది.” అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement