న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలలో ఎస్సీల వర్గీకరణకు సహకరించవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సమితి ఛైర్మన్ చెయ్య నాయకత్వంలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖా మంత్రి రామ్‌దాస్ అథవాలేను న్యూఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజ్యాంగ అధికరణ 341ను సవరించి వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఇవ్వవద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పును అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని, ఎస్సీల ఇతర సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహిళా సభ్యులు రామ్‌దాస్ అథవాలేకు రాఖీలు కట్టి తమకు అండగా ఉండాలని అభ్యర్థించారు.
సుప్రీంకోర్టు నోటీసులు అగ్రవర్ణాల కుట్ర
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన నోటీసులు అగ్రవర్ణాల కుట్ర అని మాలల జేఏసీ ఆరోపించింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అరుణ్ కుమార్, జేఏసీ ఛైర్మన్ తాళ్లపల్లి రవి, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడుపసుల రామ్మూర్తి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండోరోజు ధర్నా నిర్వహించారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని ధర్మాసనం చెప్పిన తీర్పును గుర్తు చేశారు. మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.