చెలమణి నుంచి ఉపసంహరించుకున్న 2వేల నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు కార్డులు, పత్రాలు అవసరంలేదని ఎస్‌బీఐ తెలిపింది. ఎలాంటి ఫారం నింపాల్సిన పని లేకుండానే ఇలా 20 వేల విలువై నోట్లను మార్చుకోవచ్చని ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 2వేల నోట్లను మార్చుకునేందుకు రిక్విజిషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, ఐడీ ప్రూప్ కూడా చూపించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఎస్‌బీఐ సర్క్యూలర్ జారీ చేసింది.
ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు లీగల్ టెండర్‌గా 2వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి. మే 19న ఆర్బీఐ 2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై పలు ఉహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 23 నుంచి అన్ని బ్యాంక్‌ల శాఖలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ 2వేల నోట్లను మార్చుకోవచ్చు. వ్యక్తులు తమ బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు మాత్రం ఎలాంటి పరిమితి విధించలేదు. ఆర్బీఐ 2వేల నోట్లను 2016 నవంబర్‌లో కొత్తగా చలమాణిలోకి తీసుకు వచ్చింది. అప్పటి వరకు ఉన్న 500, 1000 రూపాయల నోట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయడంతో 2వేల నోట్లను ప్రవేశపెట్టింది.
2వేల నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని జరుగుతున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తులు నేరుగా ఎలాంటి పత్రాలు చూపించకుండానే ఒక సారికి 20వేలు మార్చుకునే సదుపాయం ఉంది. ఇలా గడువు ముగిసే వరకు బ్లాక్ మనీ ఉన్న వ్యక్తుల పెద్ద సంఖ్యలో మనుషులను పెట్టి ఈజీగా నల్లడబ్బును ఎలాంటి డిపాజిట్లు చేయకుండానే భారీగా మార్చుకునేందుకు వీలు కలుగుతుందని కొంత మంది ఆర్ధిక నిపుణుల స్పష్టం చేస్తున్నారు. బ్లాక్‌మనీ ఉన్న వారు ఎలాంటి డిపాజిట్లు చేయకుండానే మనుషులను పెట్టుకుని మార్చుకోవచ్చుని చెబుతున్నారు. ఈ విధానంలో బ్లాక్ మనీ మళ్లిd బ్లాక్ మనీగానే మిగిలిపోతుంది.