న్యూఢిల్లీ: నేటి నుంచి 30వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎంపిక చేసిన ఎస్ బి ఐ లలో ఎలక్టోరల్ బాండ్లను అమ్మకానికి ఉంచారు.. కాగా, రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు ఇచ్చే ప్రత్యక్ష నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రూపొందించారు. 17వ లోక్‌సభ కాలపరిమితి ముగుస్తున్నందున ఈ ఏడాది మధ్యలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
30వ ఫేజ్ ఆఫ్ సేల్‌లో భాగంగా నేటి నుంచి జనవరి 11వ తేదీ వరకూ తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్‌క్యాష్ చేయడానికి ఎస్‌బీఐని అనుమతించడం జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
2018 నుంచీ అమలు..
మొదటి బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. ఎలక్టోరల్ బాండ్‌లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన అధీకృత బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకోగలుగుతుంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ఎస్‌బీఐ మాత్రమే అధీకృత బ్యాంకు. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్‌పూర్ ముంబైలు అధీకృత ఎస్‌బీఐ శాఖల్లో కొన్ని. ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేసిన తేదీ నుండి 15 క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్‌ను డిపాజిట్ చేసినట్లయితే, సంబంధిత రాజకీయ పార్టీకి ఆయా చెల్లింపులు జరగవు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ నిర్దిష్ట కాలంలో తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ అదే రోజు జమ అవుతుంది. గత లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1శాతం ఓట్లను పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులు.