హిందుత్వవాది వినాయక్ దామోదర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన ఇవ్వాల (గురువారం) మీడియాతో మాట్లాడారు. వీడీ సావార్కర్‌పై మళ్లి ఆరోపణలు గుప్పించారు. బ్రిటీషర్లకు సావార్కర్ భయపడ్డారని, వాళ్లకు సేవకుడిగా పని చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారని, దీని కోసం బ్రిటీషర్లకు సావార్కర్ లేఖలు కూడా రాసినట్లు రాహుల్ తెలిపారు. సావర్కర్‌ను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చిహ్నంగా రాహుల్ అభివర్ణించారు. అండమాన్ జైల్లో ఉన్న సమయంలో, క్షమాబిక్ష కోసం బ్రిటీషు వారికి ఆయన అర్జీలు పెట్టుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారని చెప్పారు. బ్రిటిషర్ల నుంచి పించన్ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై వచ్చిన విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. సావర్కర్ బ్రిటిషర్లకు రాసిన క్షమాబిక్ష పిటిషన్లను మీడియాకు చూపించారు. మహాత్మాగాంధీ, నెహ్రూ వంటి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు జైలులో ఏళ్లతరబడి శిక్షలు అనుభవించినా, ఎన్నడూ ఇలాంటి లేఖలు రాయలేదని గుర్తుచేశారు. కాగా, దేశంలోని ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. అధికార, ధన బలంతో ప్రత్యర్థులను అణగదొక్కాలని బీజేపీ చూస్తోందని అన్నారు.
సామాజిక మాధ్యమాలపై..
సమాజంపై సోషల్ మీడియా ప్రభావాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎన్నికల్లో పార్టీల విజయాన్ని అవి నిర్ణయిస్తున్నాయని ఆరోపించారు. ఈవీఎంలు సురక్షితంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా ద్వారా రిగ్గింగ్ చేయవచ్చు. సోషల్ మీడియా సంస్థలు కోరుకుంటే ఏ పార్టీనైనా గెలిపించగలవ. ఇక్కడ ఒక క్రమపద్ధతిలో ఉద్దేశపూర్వకంగా పక్షపాత వైఖరులు అనుసరిస్తున్నారు. ఇందుకు నా ఖాతాలే ఉదాహరణ. ఒక సిద్ధాంతానికి చెందిన నేతలు సమాజంలో అసమానతలను, మత ఘర్షణలను వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.
నేపాల్ జాతీయ గీతాలాపన..
భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని వాసిమ్‌లో బుధవారం రాత్రి సమావేశం నిర్వ#హంచారు. సమావేశం ముగింపుగా జాతీయ గీతాలాపన అని స్వయంగా రాహుల్ మైక్‌లో ప్రకటించారు. అంతా లేచినిల్చున్నారు. ఇంతలో నేపాల్ జాతీయ గీతం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన రాహుల్ బాబు! జాతీయ గీతాన్ని ప్లే చేయండి అని నిర్వాహకులకు సూచించాడు. దాంతో తప్పును సరిదిద్దుకుని నిర్వాహకులు జనగణమన గీతాన్ని ప్లే చేశారు. దీనిపై బీజేపీ సహా పలువురు నెటిజెన్లు రాహుల్‌ను సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యలను సమర్థించం: ఉద్ధవ్
సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను సమర్థించనని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. వీడీ సావర్కర్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. అలాంటి వ్యక్తిపై విమర్శలను అంగీకరించనని చెప్పారు. అదే సమయంలో బీజేపీపైనా ఆయన విమర్శలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు భారతరత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ధ్వజమెత్తింది. అలాంటి వ్యక్తితో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న శివసేనపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ మండిపడ్డారు. బాల్‌థాక్రే ఆశయాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.