Friday, November 22, 2024

సాత్విక్‌-చిరాగ్‌ స్వర్ణ చరితం.. డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత ద్వయం

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో మరో మైలురాయి. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌ టోర్నీలో అద్భుత ఘట్టం. పురుషుల డబుల్స్‌లో భారత జంట అసాధారణ గెలుపు. 58 ఏళ్ల నిరీక్షణకు సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శె ట్టి తెరదించారు. ఆసియా చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు. డబుల్స్‌లో భారత్‌కిదే తొలి పసిడి పతకం కావడం విశేషం. కాగా, సింగిల్స్‌లో 1965లో దినేశ్‌ ఖన్నా మొదటి పసిడి పతకం సాధించాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో ఎన్నోసార్లు పతకాలు నెగ్గినప్పటికీ, టైటిల్‌ విజేతగా నిలవాలన్న స్వప్నం నెరవేరేందుకు దాదాపు ఆరు దశాబ్దాలు పట్టింది. సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఈ వెలితిని భర్తీచేసి 140 కోట్ల భారతీయులకు గర్వకారణంగా నిలిచారు. దినేశ్‌ ఖన్నా తర్వాత టైటిల్‌ విజేతగా నిలిచిన భారత షట్లర్లుగా చరిత్రకెక్కారు. పురుషుల డబుల్స్‌లో 1971లో దీపుఘోష్‌-రామన్‌ ఘోష్‌ కాంస్య పతకం నెగ్గారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ రికార్డును ఇప్పుడు సాత్విక్‌, చిరాగ్‌ బ్రేక్‌చేశారు.

- Advertisement -

2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేతలు, ఆదివారం దుబాయ్‌లోని అల్‌నాస్ర్‌ క్లబ్‌లోని షేక్‌ రషీద్‌ బిన్‌ హవ్దూన్‌ ఇండోర్‌ హాల్‌లో జరిగిన ఫైనల్లో మలేషియా ద్వయం ఓంగ్‌ యూ సిన్‌-టి యో ఈ యి పై 16-21, 21-17, 21-19 తేడాతో అద్భుత విజయాన్ని సాధించారు. మూడు గేమ్‌ల ఫైనల్‌లో 8వర్యాంకు జంటను ఓడించారు. ఓపెనింగ్‌ గేమ్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఆ తర్వాత రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నారు. మొత్తంగా 1.07 గంటల పాటు హోరాహోరీగా పోరాడి చారిత్రక విజయాన్ని అందుకున్నారు. 2023లో సాత్విక్‌-చిరాగ్‌కు ఇదే అతిపెద్ద విజయం.

గతేడాది వీరు కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచారు. ఆ తర్వాత చారిత్రాత్మక థామస్‌ కప్‌ను సొంతం చేసుకున్నారు. కాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజయం సాధించినందుకు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బిఎఐ) ప్రెసిడెండ్‌ హిమంత బిస్వా శర్మ విజేతలను ప్రశంసించారు. వీరికి రూ.20 లక్షలు నగదు బహుమతి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement