కొరియా ఓపెన్‌లో భారత డబుల్స్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ సంచలనం సృష్టించాడు. అత్యంత వేగవంతమైన స్మాష్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. సాత్విక్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్‌ను కొట్టాడు. దాంతో, పురుషుల బాడ్మింటన్‌లో కాక్‌ను బలంగా కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సాత్విక్ వేగవంతమైన ష్మాష్‌తో పదేళ్ల కిందటి రికార్డు బద్ధలైంది. మలేషియా ఆటగాడు టాన్ బూన్ హంగ్ 2013లో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో స్మాష్ ఆడాడు.
ఇదిలావుండగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ సుపాక్ జొమ్‌కొహ్, కిట్టినుపాంగ్ కెడ్రెన్‌పై 21-16, 21-14తో గెలుపొందింది. ఆరంభం నుంచీ ఆధిపత్యం చెలాయించిన భారతద్వయం 32 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జంట ప్రి-క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇటీవల ఇండోనేషియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వీరిద్దరు, టాప్ సీడ్లను కూడా చిత్తుచేస్తూ ముందుకుసాగారు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ జంట డబుల్స్‌లో ఆరో ర్యాంక్‌లో కొనసాగుతున్నది.