హైదరాబాద్, ఆంధ్రప్రభ : అగ్రదేశం అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలన్న తెలంగాణ విద్యార్థుల కలలను ఇంటర్ బోర్డు కల్లలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పేరొందిన స్కూళ్లలో డిగ్రీలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే అర్హత పరీక్ష శాట్ మే 7న జరగనుంది. ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. అయితే ఈ పరీక్ష జరుగుతున్న రోజే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్ష ఉండడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్‌ను ఆశ్రయించి 7వ తేదీ జరిగే ఇంటర్ ద్వితీయ పరీక్షను మరో రోజుకు వాయిదా వేయాలని అభ్యర్థించారు. శాట్‌ను ముందే నిర్ణయించిన తేదీన హాజరు కాకపోతే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని తిరిగి ఈ పరీక్షను వచ్చే ఏడాదే నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డు అధికారులకు మొర పెట్టుకున్నారు. శాట్‌లో అర్హత సాధిస్తే అమెరికా వెళ్లి నేరుగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశం ఉందని ఏటా వెయ్యి మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లి ప్రవేశాలు పొందుతారని వారు చెప్పారు. ఇంటర్ పరీక్షను మరో రోజు వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఉన్నత విద్యా శాఖ అధికారులు మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తున్నారు.
సంపన్న వర్గాల పిల్లలు శాట్‌ను రాసి విదేశాలకు వెళుతున్నారన్న ఆరోపణలు తమపై చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అమెరికాలోని స్కూళ్లు అందిస్తాయని అందులో భాగంగానే తమ పిల్లలను అక్కడికి పంపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్ పరీక్షను మరో రోజు వాయిదా వేయడం ద్వారా జరిగే నష్టమేదీ లేదని శాట్ పరీక్ష ఏడాదిలో ఒక్కసారే నిర్వహిస్తారని ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ విషయంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు జోక్యం చేసుకుని ఇంటర్ బోర్డు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. విద్యాశాఖ మంత్రి సబితకు ఇప్పటికే ఈ పరీక్ష అంశానికి సంబంధించి వినతిపత్రం ఇచ్చామని ఆమె మే 7న జరిగే ఇంటర్ పరీక్ష వాయిదాకు సుముఖత వ్యక్తం చేసినా కొందరు అధికారులు ఇందుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా శాట్ జరగలేదని విద్యార్థులు కూడా అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఏదో ఒక కోర్సులో చేరి తమ విద్యాభ్యాసాన్ని కొసాగించారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..